సబ్‌ప్లాన్‌ నిధుల వినియోగంపై కేంద్రం అంతులేని నిర్లక్ష్యం

Dec 6,2023 22:10 #sc sub-plan funds

– ఏడాదిలో రూ.13,961.54 కోట్ల కేటాయింపులు రద్దు

– ఐదేళ్లలో మురిగిపోయిన రూ.71,686 కోట్లు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:దళితుల సాధికారత, సంక్షేమం కోసం షెడ్యూల్డ్‌ తరగతుల ఉపప్రణాళిక (ఎస్‌సి సబ్‌ప్లాన్‌) నిధుల వినియోగంపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి యేటికేడూ ఎస్‌సి సబ్‌ప్లాన్‌కు నిధుల కేటాయింపును తగ్గిస్తూ వస్తున్న మోడీ సర్కార్‌ కేటాయించిన అరకొర నిధులను ఖర్చు చేయడంలోనూ ఘోరంగా విఫలమవుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి గత ఐదేళ్లలో ఎస్‌సి సబ్‌ ప్లాన్‌కు సంబంధించిన సుమారు రూ.72 వేల కోట్ల నిధులు ఖర్చు కాకుండానే మురిగిపోయాయి. సబ్‌ప్లాన్‌ నిధుల వినియోగంపై రాజ్యసభలో బుధవారం నాడు సిపిఎం ఎంపి వి శివదాసన్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి రాందాస్‌ అథవాలే రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2022-23లో రూ.13,961.54 కోట్ల ఎస్‌సి సబ్‌ప్లాన్‌ నిధులను ఖర్చు చేయలేకపోయామని, దీంతో ఆ మొత్తం నిధులు రద్దయ్యాయని మంత్రి తెలిపారు. గత ఐదేళ్లలో సకాలంలో నిధులను ఖర్చు చేయనందున మొత్తం రూ.71,686.43 కోట్ల సబ్‌ప్లాన్‌ నిధులు మురిగిపోయినట్లు ఆయన పేర్కొన్నారు. దళితోద్ధరణకు ఎంతో కృషి చేస్తున్నామంటూ ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా ఊదరగొట్టే బిజెపి పెద్దలు సబ్‌ప్లాన్‌ నిధుల వినియోగంలో నిర్లక్ష్యానికి ఏం సమాధానం చెబుతారని సామాజిక వేత్తలు నిలదీస్తున్నారు.

ఏడాది       మురిగిపోయిన నిధులు

2018-19     రూ.9,818.24 కోట్లు

2019-20     రూ.11,042.26 కోట్లు

2020-21      రూ.19,922.35 కోట్లు

2021-22       రూ.16,942.04 కోట్లు

2022-23     రూ.13,961.54 కోట్లు

మొత్తం             రూ.71,686.43 కోట్లు

➡️