రాజ్యసభకు నామినేట్‌ అయిన చండీగఢ్‌ యూనివర్శిటీ వ్యవస్థాపకులు

న్యూఢిల్లీ  :  చండీగఢ్‌ యూనివర్శిటీ వ్యవస్థాపకులు- చాన్సలర్‌ సత్నామ్‌ సింగ్‌ సంధు రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను పార్లమెంట్‌ ఎగువ సభకు నామినేట్‌ చేసినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. రైతు కుటుంబానికి చెందిన సంధు .. దేశంలోని ప్రముఖ విద్యావేత్తలలో ఒకరని తెలిపింది.

చిన్నతనంలో విద్యకోసం ఎంతో కష్టపడిన ఆయన లక్షలాది మంది విద్యార్థులకు విద్యనందించేందుకు కృషి చేశారని పేర్కొంది. 2001లో మొహాలిలోని లాండ్రాన్‌లో చండీగఢ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కాలేజెస్‌ (సిజిసి)ని ప్రారంభించారని, అనంతరం 2012లో చండీగఢ్‌ విశ్వవిద్యాలయాన్ని స్థాపించినట్లు నోటిఫికేషన్‌ తెలిపింది. ఇండియన్‌ మైనారిటీస్‌ ఫౌండేషన్‌, న్యూ ఇండియా డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌ల ద్వారా ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగుపరచడానికి, అలాగే మత సామరస్యాన్ని పెంపొందించడానికి పెద్ద ఎత్తున కమ్యూనిటీ ప్రయత్నాలలో చురుకుగా పాల్గొన్నారని  వెల్లడించింది.

సత్నామ్‌ సింగ్‌ను రాజ్యసభ సభ్యుడిగా నామినేట్‌ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లుగా ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. సంధును రాజ్యసభకు నామినేట్‌ చేసినందుకు సంతోషంగా ఉందని, ప్రముఖ విద్యావేత్తగా, సామాజిక సేవకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. సత్నామ్‌ సింగ్‌ ఎప్పుడూ జాతీయ ఐక్యతను పెంపొందించారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. రాజ్యసభకు నామినేట్‌ అయినందుకు సంధుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాని అన్నారు.

➡️