Delhi water crisis: కేంద్రం జోక్యం చేసుకోవాలి

న్యూఢిల్లీ :   కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే ఢిల్లీలో నీటి సంక్షోభ పరిస్థితి మెరుగుపడదని ఢిల్లీ మంత్రి అతిషి ఆదివారం పేర్కొన్నారు. హర్యానాలోని తమ ప్రభుత్వంతో బిజెపి చర్చించి ఢిల్లీ ఎక్కువ నీరు పొందేలా చూడాలని అన్నారు. ఢిల్లీలో నీటి ఎద్దడి తీవ్రమవుతుండటంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీలోని ప్రధాన పైప్‌లైన్‌లకు భద్రత కల్పించేందుకు పోలీస్‌ సిబ్బందిని నియమించాలని కోరుతూ ఆదివారం ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ సంజరు అరోరాకు మంత్రి లేఖ రాశారు. సోనియా విహార్‌ నుండి దక్షిణ ఢిల్లీ ప్రధాన పైప్‌ లైన్‌లో లీకేజీ ఏర్పడిందని అన్నారు. దక్షిణ ఢిల్లీ మొత్తం నీరు అందించే ఈ పైప్‌లైన్‌ లీకేజీ వెనుక ఏదో కుట్ర ఉన్నట్లు ఆ లేఖలో పేర్కొన్నానని అన్నారు. అయితే ఇది ఆరోపణలు, ప్రత్యారోపణలకు, నీచరాజకీయాలకు సమయం కాదని అన్నారు. హర్యానాలోని తమ ప్రభుత్వంతో మాట్లాడి ఢిల్లీకి ఎక్కు నీరు ఇప్పించాలని బిజెపిని అభ్యర్థిస్తున్నాని అన్నారు. ఈ పరిస్థితిలో కేంద్రం జోక్యం చేసుకోకపోతే .. పరిస్థితి బాగుపడదని అన్నారు.

తమ నీటి నిర్వహణ బృందం ఆరు గంటల పాటు శ్రమించి పైప్‌లైన్  లీకేజీని సరిచేసిందని, దీని అర్థం ఆరు గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేయాల్సి వచ్చిందని అన్నారు. ఈ సమయంలో 20 ఎంజిడి నీటిని సరఫరా చేయలేదని, ఫలితంగా దక్షిణ ఢిల్లీలో మరో 25 శాతం నీటి కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

➡️