కేజ్రీవాల్‌పై మరో తప్పుడు కేసు : ఆప్‌ మంత్రి అతిషీ

Mar 17,2024 13:23 #Arvind Kejriwal, #Delhi Jal Board

న్యూఢిల్లీ :  ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై మరో తప్పుడు కేసు బనాయించారని ఆప్‌ మంత్రి అతిషీ మండిపడ్డారు.  కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) ఆదివారం తాజాగా సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.  దీంతో ఈ సమన్లు ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించినవే అని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఈ సమన్లు లిక్కర్‌ పాలసీ కేసుకు సంబంధించినవి కావని మంత్రి అతిషీ స్పష్టం చేశారు. ఈ సమన్లపై ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. మద్యంకేసులో కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేయలేమని భావించిన కేంద్రం ఇప్పుడు మరో తప్పుడు కేసుతో కేజ్రీవాల్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని.. అందులో భాగంగానే తాజాగా సమన్లు జారీ చేసిందని దుయ్యబట్టారు.

కేజ్రీవాల్‌కు శనివారం సాయంత్రం ఇడి నుండి మరోసారి సమన్లు అందాయని, ఢిల్లీ జల్‌ బోర్డ్‌కు సంబంధించిన కేసులో మార్చి 21న ఇడి కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆ సమన్లలో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ కేసు గురించి ఎవరికీ తెలియదని, ఇదో తప్పుడు కేసని అతిషీ పేర్కొన్నారు.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఇడి అధికారులు కేజ్రీవాల్‌కు ఇప్పటికే ఎనిమిదిసార్లు సమన్లు పంపారు. ఈ సమన్లకు ఆయన స్పందిచకపోవడంతో ఢిల్లీ కోర్టులో ఇడి రెండు ఫిర్యాదులు నమోదు చేసింది. ఈ ఫిర్యాదులపై శనివారం విచారణ సందర్భంగా కేజ్రీవాల్‌ కోర్టు ముందు హాజరయ్యారు. చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఆయనకు బెయిల్‌ మంజూరు చేశారు. ఆ మరుసటి రోజే కేజ్రీవాల్‌కు ఇడి మరో కేసులో సమన్లు జారీ చేయడం గమనార్హం.

➡️