కేంద్రానికి అసాధారణ అధికారాలు

Dec 23,2023 11:07 #PM Modi
  • ఆ మూడు బిల్లుల లక్ష్యం అదే
  • వార్తలను సెన్సార్‌ చేయొచ్చు
  • ఇంటర్నెట్‌ సేవలు నిలిపేయవచ్చు
  • గోప్యత హక్కుకు భంగం కలిగించవచ్చు

న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన మూడు బిల్లులు సర్కారుకు అసాధారణ అధికారాలు కట్టబెడుతున్నాయి. ఈ బిల్లుల ద్వారా ఇకపై కేంద్రం తన ఇష్టానుసారం వార్తలను సెన్సార్‌ చేయవచ్చు. ఇంటర్నెట్‌ సేవలను సులభంగా నిలిపివేయవచ్చు. సమాచార మార్పిడిని అడ్డుకోవచ్చు. వాట్సప్‌ వంటి సామాజిక మాధ్యమాలలో వ్యక్తుల మధ్య నడిచే సంభాషణలను తెలుసుకోవచ్చు. తద్వారా సమాచార గోప్యతకు సంబంధించిన హక్కుకు భంగం కలిగించవచ్చు.

డిజిపబ్‌ సంస్థ ఈ నెల 20న నిర్వహించిన సమావేశంలో పలువురు నిపుణులు ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 60కి పైగా డిజిటల్‌ న్యూస్‌ మీడియా సంస్థలు, స్వతంత్ర పాత్రికేయులు, వ్యాఖ్యాతలకు డిజిపబ్‌ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇంతకీ కేంద్రం తీసుకొచ్చిన మూడు బిల్లులు ఏమిటంటే…టెలికమ్యూనికేషన్‌ బిల్లు, బ్రాడ్‌కాస్టింగ్‌ సర్వీసుల (నియంత్రణ) ముసాయిదా బిల్లు, డిజిటల్‌ పర్సనల్‌ డాటా ప్రొటెక్షన్‌ చట్టం.

  • దేనినైనా సెన్సార్‌ చేయొచ్చు

ప్రభుత్వం దృష్టిలో అస్పష్టంగా ఉన్న వార్తలు సహా ఆన్‌లైన్‌ సమాచారాన్ని నియంత్రించే అధికారం బ్రాడ్‌కాస్టింగ్‌ బిల్లు ద్వారా సర్కారుకు లభిస్తుందని ‘ది క్వియంట్‌’ పోర్టల్‌ సీఈఓ రితూ కపూర్‌ తెలిపారు. అయితే శిక్ష, విచారణ, దర్యాప్తు, సెన్సార్‌షిప్‌ వంటి చర్యలకు ఎలాంటి వార్తలు దారితీస్తాయో స్పష్టంగా తెలియడం లేదని ఆమె చెప్పారు. సీఈఓలు స్వీయ ధృవీకరణ చేసిన వార్తలను మాత్రమే ప్రసారం చేయాలని అనడం పత్రికలకు ఆచరణ సాధ్యం కాదని అన్నారు. వార్తా పత్రికలకు వర్తించే ఆంక్షలే సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యలు చేసే వారికి కూడా వర్తిస్తాయని డిజిటల్‌ వార్తా కథనాల రూపకర్త మేఫ్‌ునాథ్‌ తెలిపారు. వార్తలు, కరంట్‌ అఫైర్స్‌ కార్యక్రమాలు ప్రభుత్వం నిర్దేశించిన నియమావళికి కట్టుబడి ఉండాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఈ నియమావళి కార్యక్రమాలను నియంత్రిస్తూ ఉంటుందని అన్నారు. వార్తలను అందించే పాత్రికేయులు తమకు ఆ సమాచారం ఎక్కడ నుండి వచ్చిందో గోప్యంగా ఉంచే అవకాశం ఇక ఉండబోదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఇష్టం లేని అంశాలను చర్చించే వారిని లక్ష్యంగా చేసుకొని ఈ చట్టాలను ప్రయోగించే ప్రమాదం ఉన్నదని ‘ది మూక్‌నాయక్‌’ న్యూస్‌ వెబ్‌సైట్‌ వ్యవస్థాపకురాలు మీనా కొట్వాల్‌ తెలిపారు. అన్ని విషయాలు ప్రభుత్వం చేతిలో ఉంటాయి కాబట్టి ఏది ఒప్పో ఏది తప్పో అదే నిర్ణయిస్తుందని చెప్పారు. ‘ప్రభుత్వంలోని పలు మంత్రిత్వ శాఖలు తప్పుడు సమాచారం ఇస్తుంటాయి. అయితే వాటిని ఎవరూ ఏమీ చేయరు. మనం అందించే సమాచారం సరైనదే అయినప్పటికీ మనల్ని లక్ష్యంగా చేసుకోవడం తేలిక’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని, దాని విభాగాలను విమర్శిస్తూ కథనాలు ప్రచురించే పాత్రికేయులను వేధించడం, అరెస్ట్‌ చేయడం వంటి ఉదంతాలు ఇటీవల చోటుచేసుకుంటున్నాయి. అలాంటి ఘటనలు పాత్రికేయులను నిరుత్సాహపరుస్తాయి. వారిలో భయాన్ని రేకెత్తించి స్వీయ నియంత్రణకు అవకాశం కల్పిస్తాయి.

  • నిఘా పెరుగుతుంది

‘టెలికం బిల్లు కారణంగా మీడియాపై ప్రభుత్వ నిఘా పెరుగుతుంది. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోతాయి. సమాచారాన్ని ఎవరికీ అందుబాటులో లేకుండా దానిని కోడ్‌గా మార్చేయవచ్చు’ అని న్యాయవాది అపర్‌ గుప్తా తెలిపారు. లోక్‌సభ నుండి 95 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేసిన తర్వాత ఈ బిల్లును ఆమోదించారు. ఇంటర్నెట్‌ సేవలను దీర్ఘకాలం నిలిపివేస్తే జమ్మూకాశ్మీర్‌, మణిపూర్‌ ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా నష్టపోతారని గుప్తా చెప్పారు. బిల్లును రూపొందించే సమయంలో టెలికమ్యూనికేషన్‌ నిబంధనలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. 2022 సెప్టెంబరులో ప్రజా సంప్రదింపుల కోసం విడుదల చేసిన దానితో పోలిస్తే ప్రస్తుత బిల్లు ఘోరంగా ఉన్నదని, అప్పుడు ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను టెలికం శాఖ బహిర్గతం చేయలేదని తెలిపారు. ‘ఒకరి నుండి మరొకరికి వచ్చిన సందేశాన్ని వాట్సప్‌ అప్లికేషన్‌ కోడ్‌ రూపంలో మార్చి దానిని అధికారులకు పంపాల్సి ఉంటుంది. ఒకరి సందేశాలు మరొకరు చదవడం సాధ్యం కాదని ప్రస్తుతం వాట్సప్‌ చెబుతోంది. సందేశాన్ని తాను కూడా చూడలేనని అంటోంది. మరి ఇప్పుదేమో సందేశాన్ని కోడ్‌గా రాసే బాధ్యతను వాట్సప్‌కి అప్పగిస్తే సమాచార గోప్యత హక్కుకు భంగం కలగదా?’ అని ప్రశ్నించారు. మణిపూర్‌ హింసకు సంబంధించి సామాజిక మాధ్యమాలలో వచ్చే ఏ వార్తనైనా ఉద్రిక్తతకు కారణమవుతోందన్న సాకుతో నిరోధించే అధికారం కేంద్రానికి లభిస్తుందని న్యాయవాది బృందా భండారీ తెలిపారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు అన్ని టెలికం సేవలను నిలిపివేసే అధికారం టెలికం బిల్లు ద్వారా ప్రభుత్వానికి లభిస్తుందని న్యాయవాది శ్రేయా సింఘాల్‌ చెప్పారు.

➡️