గుండెపోటుతో ప్రముఖ కవి కన్నుమూత

May 11,2024 11:27 #death, #kavi, #panjab

పంజాబ్‌ : పంజాబ్‌కు చెందిన ప్రముఖ కవి, రచయిత సుర్జిత్‌ పటార్‌ (79) కన్నుమూశారు. గుండెపోటుతో శనివారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో పంజాబ్‌ సాహిత్య సమాజం శోకసంద్రంలో మునిగిపోయింది.  ఆయన మృతి పట్ల వివిధ రంగాల ప్రముఖులు, మేధావులు, కవులు, రచయితలు, అభిమానులు సంతాపం తెలిపారు.

1945లో జలంధర్ జిల్లాలోని పతర్ కలాన్ గ్రామంలో జన్మించిన డాక్టర్ పటార్.. పాటియాలాలోని పంజాబ్ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. అనంతరం అమృత్‌సర్‌లోని గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. అంతేగాక సాహిత్య రంగంలో ప్రత్యేక ముద్ర వేశారు. పటార్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2012లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అలాగే ఆయనకు 1979లో పంజాబ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1993లో సాహిత్య అకాడమీ అవార్డు, 1999లో పంచానంద్ పురస్కారం, 2007లో ఆనంద్ కావ్య సమ్మాన్, 2009లో సరస్వతి సమ్మాన్, గంగాధర్ జాతీయ పద్య పురస్కారం లభించాయి. 2014లో కుసుమాగ్రజ్ లిటరరీ అవార్డు సైతం లభించింది. అయితే కేంద్ర తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులకు సుర్జిత్ మద్దతు తెలిపారు. చట్టాలను వెనక్కి తీసుకోకపోతే తన పద్మశ్రీని వెనక్కి ఇస్తానని ప్రకటించారు.

➡️