రైతు పక్షమా…అమెరికాకు దాసోహమా?

Feb 13,2024 10:25 #modi

డబ్ల్యూటిఓలో భారత్‌ వైఖరిపై సర్వత్రా ఆసక్తి

న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు ఆసరాగా నిలుస్తుందా లేక అమెరికాకు కొమ్ము కాస్తుందా అనే విషయం త్వరలోనే తేలిపోతుంది. ఈ నెల 26న అబూధాబీలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటిఓ) మంత్రుల స్థాయి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో భారత్‌ తన వైఖరిని తెలియజేయాల్సి ఉంటుంది. మోడీ ప్రభుత్వంపై రైతులు ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, వ్యవసాయ కార్పొరేటీకరణకు స్వస్తి చెప్పాలని వారు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో లక్షలాది మంది రైతుల అభ్యున్నతి కోసం ఆయన సూచించిన వ్యవసాయ సంస్కరణల్ని అమలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. రైతుల దీర్ఘకాలిక డిమాండ్‌ను పట్టించుకోని ప్రభుత్వం పేదలకు ఆహార భద్రత కల్పించేందుకు ఆహార ధాన్యాల కొనుగోలు, నిల్వ, పంపిణీ కోసం శాశ్వత పరిష్కారం కనుగొనాలని డబ్ల్యూటీఓలో గట్టిగా వాదిస్తుందని ఎలా అనుకోగలమని అంటున్నారు. ఈ నెల 26న అబూధాబీలో జరిగే డబ్ల్యూటీఓ వాణిజ్య మంత్రుల సమావేశానికి వెయ్యి మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారు. వ్యవసాయానికి సంబంధించి వర్ధమాన దేశాలు చేస్తున్న డిమాండ్‌ను నెరవేర్చే అవకాశం ఉన్నదా లేదా అనే విషయంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశంలో అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, చైనా పలు అంశాలను ప్రస్తావించే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. ప్రపంచంలో మెజారిటీ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న ప్రధాన అంశం ఆహార భద్రత. దీనికి ప్రభుత్వాలు గ్యారంటీ ఇవ్వగలవా అనేదే ప్రశ్న.డబ్ల్యూటిఒ ప్రస్తుత నిబంధనలు వర్ధమాన దేశాల ప్రయోజనాల కన్నా సంపన్న దేశాల ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ నిబంధనలను సవరించే యత్నాలను అమెరికా, ఈయూ, జపాన్‌, స్విట్జర్లాండ్‌, నార్వే, కెనడా తదితర దేశాలు అనుమతించవు. మోడీ ప్రభుత్వం అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి దేశ ప్రయోజనాలపై రాజీ పడినా ఆశ్చర్యం లేదు. ఆహార భద్రతకు శాశ్వత పరిష్కారం కనుగొనాలన్న డిమాండ్‌ను అమెరికా వ్యతిరేకిస్తోంది. ఇండొనేషియా నేతృత్వంలోని జీ-33 దేశాలు, ఆఫ్రికా గ్రూపు సహా వర్థమాన దేశాలు శాశ్వత పరిష్కారం కోసం డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే ఈ దేశాలు ఇప్పుడు భారత్‌ వైపు చూస్తున్నాయి. భారత్‌ ముందుండి తమను నడిపించాలని అవి కోరుకుంటున్నాయి. అయితే వాణిజ్య ఒప్పందాలకు కట్టుబడి ఉండే విషయంలో మోడీ ప్రభుత్వ రికార్డు దారుణంగా ఉంది. 2015లో వాణిజ్య మంత్రిగా ఉన్న ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎలాంటి ప్రతిఘటన చూపకుండానే అమెరికాకు దాసోహమన్నారు. ఏదేమైనా మరో రెండు నెలల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తుందా లేక దేశీయంగా, అంతర్జాతీయంగా కాడి కింద పడేసి అమెరికాకు లొంగిపోతుందా అన్నది వేచి చూడాల్సిందే.

➡️