సభాసంప్రదాయాలకు తిలోదకాలు

governor powers misuse
  • బడ్జెట్‌ సమావేశాల్లో 75 సెకన్ల ప్రసంగం 
  • నాలుగు నిమిషాల్లో సభ నుంచి నిష్క్రమణ
  • కేరళ గవర్నరు ఆరిఫ్‌ తీరుపై సర్వత్రా విమర్శలు

తిరువనంతపురం : కేరళ గవర్నరు ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ తీరుమారు మారోమారు వివాదస్పదమైంది. చట్టసభల ఔనత్యాన్ని పరిరక్షించి రాజ్యంగ ధర్మకర్తగా సభా సంప్రదాయాలను పాటించాల్సిన ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరించడం పరిపాటిగా మారిపోయింది. గురువారం రాష్ట్రంలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నరు ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ తన ప్రసంగాన్ని 75 సెకన్లలోనే ముగించారు. అది కూడా ప్రభుత్వ విధానాన్ని తెలియజేసే ప్రసంగ పాఠంలోని ప్రారంభ వాక్యాలను, చివరి పేరాగ్రాఫ్‌ను మాత్రమే చదివి మమ అనిపించారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీకి చేరుకున్న గవర్నరు ఆరిఫ్‌ ఖాన్‌కు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, స్పీకరు స్వాగతం పలికారు. అనంతరం సభలో ప్రసంగాన్ని మొదలుపెట్టిన ఆయన.. నేరుగా చివరి పేరా చదివేసి అంతటితో ప్రసంగాన్ని ముగించారు. లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వం రూపొందించిన 62 పేజీల ప్రసంగాన్ని చదివేందుకు ఆయన ఇష్టపడలేదు. 9:02 గంటల్లోపు ప్రసంగం ముగించిన ఆయన.. ఉదయం 9:04 గంటలకు సభ నుంచి వెళ్లిపోయారు. కనీసం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో కరచాలనం కూడా చేయకుండానే సభ నుంచి నిష్క్రమించారు. ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల్లో పెత్తనం చెలాయించడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందన్న విమర్శలు ఇప్పటికే ఉన్న సంగతి విదితమే. ప్రత్యేకించి కేరళ, తమిళనాడు, పశ్చిబెంగాల్‌ రాష్ట్రాల్లో గవర్నర్లు కేంద్రానికి కీలుబొమ్మలుగా మారారన్న విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు, కేరళ అసెంబ్లీల్లో ఆమోదించిన బిల్లులపై ఎటూ తేల్చకుండా గవర్నరు కార్యాలయంలోనే తొక్కిపెడుతున్న వైనాన్ని చూశాం. దీనిపై ఆయా రాష్ట్రాలు న్యాయస్థానాలను ఆశ్రయించిన సందర్భాల్లో గవర్నర్లు న్యాయస్థానాల చీవాట్లు కూడా ఎదుర్కొన్నారు. ఆరిఫ్‌ లాంటి వ్యక్తులు రాజ్యాంగ పదవుల ప్రతిష్టతను ఇలాంటి చర్యలతో దిగజార్చుతున్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రజానీకాన్ని అవమానించడమే !

కేరళ అసెంబ్లీలో ఆరిఫ్‌ ప్రవర్తించిన తీరు రాష్ట్ర ప్రజానీకాన్ని అవమానించడమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ప్రభుత్వ విధానాన్ని వివరించే బాధ్యత గవర్నర్‌దే. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగంతో వ్యక్తిగతంగా తనకు అభిప్రాయ బేధాలున్నా..నచ్చినా నచ్చకపోయినా కచ్చితంగా ఆ ప్రసంగ పాఠాన్నే గవర్నరు చదివితీరాలి. ఒకవేళ గవర్నరు చదివినా.. చదవకపోయినా ఆ పత్రం చెల్లుబాటుపై ఎటువంటి ప్రభావమూ ఉండదు. కాకపోతే చదవడం గవర్నరు రాజ్యాంగ బాధ్యత. కేంద్ర పెద్దల మెప్పు పొందేందుకే ఆరిఫ్‌ ఇలా వ్యవహరించినట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు విమర్శించారు.

➡️