ఎలక్షన్‌ కమిషనర్లుగా జ్ఞానేష్‌ కుమార్‌, సుఖ్‌బీర్‌ సంధు

Mar 15,2024 00:30 #Election Commissioners

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్లుగా మాజీ బ్యూరోక్రాట్‌లు జ్ఞానేష్‌ కుమార్‌, సుఖ్భీర్‌ సింగ్‌ సంధులను నియమించారు. ఎన్నికల కమిషన్‌లో ఖాళీ అయిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల ఉన్నత స్థాయి సెలక్షన్‌ బోర్డు గురువారం సమావేశం అయింది. ఈ సమావేశంలో ప్రధాని మోడీతో పాటు కమిటీ సభ్యులు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి పాల్గొన్నారు. ఈ సమావేశంలో జ్ఞానేష్‌ కుమార్‌, సుఖ్భీర్‌ సింగ్‌ సంధులను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కమిటీ సభ్యుల్లో ఒకరు, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి మాట్లాడుతూ ”బుధవారం రాత్రి పరిశీలన కోసం నాకు 212 పేర్లు ఇచ్చారు. సమావేశానికి పది నిమిషాల ముందు ఆరుగురి(ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌, ప్రదీప్‌ కుమార్‌ త్రిపాఠి, జ్ఞానేష్‌ కుమార్‌, ఇండెవర్‌ పాండే, సుఖ్బీర్‌ సింగ్‌ సంధు, సుధీర్‌ కుమార్‌ గంగాధర్‌ రహతే)తో కూడిన షార్ట్‌లిస్ట్‌ పేర్లను ఇచ్చారు. చివరకు పంజాబ్‌కు చెందిన సంధూ, కేరళకు చెందిన జ్ఞానేష్‌ ను ఎంపిక చేశారు. కమిటీలో మెజారిటీ వారికి ఉంది. కాబట్టి వారు తమకు కావలసిన అభ్యర్థులను ఎంచుకున్నారు. ఇది ఏకపక్షమని నేను చెప్పను. కాకపోతే ఇసిల ఎంపికకు అనుసరిస్తున్న ప్రక్రియలో లోపాలున్నాయి. ఎంపిక కమిటీలో సిజెఐ సభ్యులుగా ఉండాలి” అని అన్నారు. అలాగే ఎంపిక విధానాన్ని తాను ప్రశ్నించానని, దీనిపై అసమ్మతి లేఖ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. కాగా ఇసిల నియామకం కోసం న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, హోంశాఖ కార్యదర్శి, సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్న సెర్చ్‌ కమిటీ ప్రతిపాదిత పేర్లతో జాబితాను రూపొందించింది. అనంతరం మోడీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశమై దీనిపై చర్చించింది. అనుప్‌ చంద్ర పాండే పదవీ విరమణ, అరుణ్‌ గోయల్‌ రాజీనామా కారణంగా కమిషన్‌లో రెండు పోస్టులు ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పోస్టులు భర్తీ అయ్యాయి.
అమిత్‌ షా శాఖ మాజీ కార్యదర్శే జ్ఞానేష్‌ కుమార్‌
జ్ఞానేష్‌ కుమార్‌ 1988 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, సహకార శాఖ కార్యదర్శిగా ఉన్న ఆయన 2024 జనవరి 31న పదవీ విరమణ పొందారు. ఆర్టికల్‌ 370 రద్దు చేసినప్పుడు కూడా హౌం శాఖలోనే బాధ్యతలు నిర్వర్తించారు. జ్ఞానేష్‌ కుమార్‌ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతోపాటు అమిత్‌ షా నేతృత్వంలోని సహకార మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. సుఖ్‌బీర్‌ సంధు 1988 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి. పంజాబ్‌కు చెందిన సంధు ఉత్తరాఖండ్‌ ఐఎఎస్‌ కేడర్‌కు చెందినవారు. సంధు గతంలో ఉత్తరాఖండ్‌ ప్రధాన కార్యదర్శిగా, నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌తో సహా పలు కీలక ప్రభుత్వ పదవులు చేపట్టారు.

➡️