జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి : కేజ్రీవాల్‌

Jan 1,2024 12:04 #AAP convener, #Arvind Kejriwal
kejriwal-appears-in-court-through-video-conferencing-in-excise-policy-case

న్యూఢిల్లీ   :   ప్రజా శ్రేయస్సు కోసం తాము ఎంచుకున్న మార్గంలో జైలుకు వెళ్లేందుకు పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం పార్టీ కార్యకర్తలతో జరిగిన వర్చువల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పదేళ్లలో 1,350 రాజకీయ పార్టీల్లో ఆప్‌ పార్టీ మూడో స్థానానికి ఎదిగింది. మన పార్టీ నేతలు విజయం సాధించకపోయి వుంటే, మంచి చేయకపోయివుంటే జైలుకు వెళ్లేవారు కాదని, ఈ రోజు అందరూ తమ కుటుంబాలతో సంతోషంగా ఉండేవారని అన్నారు. ఢిల్లీ లిక్కర్‌ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో జనవరి 3న విచారణకు హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి)కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సమన్లపై స్పందిస్తూ.. కేజ్రీవాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

” మనం దాడిని ఎదుర్కొంటున్నామని భావిస్తున్నాను. అయితే మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు జైలులో ఉన్న మన ఐదుగురు నేతలు మనకు హీరోలు. వారిని చూస్తే గర్వంగా ఉంది. పిల్లలకు ఉన్నతమైన విద్య, పేదలకు ఉచిత వైద్యం గురించి మాట్లాడినందుకు మనం జైలుకు వెళ్లాల్సిందే. అందుకు మనమంతా సిద్ధంగా ఉండాలి” అని అన్నారు.

➡️