మహారాష్ట్రలో భారీ వర్షాలు .. ముంబయిలో అత్యధికంగా 60మి.మీ వర్షపాతం..

Jun 9,2024 12:42 #heavy rains, #Mumbai

ముంబయి :   మహారాష్ట్ర రాజధాని ముంబయి సహా సమీప ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  శనివారం నుండి  భారీ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, తేమతో కూడిన వాతావరణం నుండి  ఈ వర్షాలు ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.

అయితే భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లాలోని మల్జిపాడ ప్రాంతంలో రహదారి కుంగిపోయింది. ఈ ప్రాంతంలో మరమ్మత్తులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ముంబయి -అహ్మదాబాద్‌ హైవేపై ఆదివారం ఉదయం నాలుగు గంటల పాటు ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. థానే, పల్ఘార్ జిల్లాల్లోని పలు రోడ్లపై వరద నీరు ముంచెత్తినట్లు అధికారులు తెలిపారు.  థానేలో పలు చోట్ల చెట్లు నేలకూలాయి.

థానే, నాసిక్‌, ఛత్రపతి శంభాజినగర్‌, అహ్మద్‌ నగర్‌, సతారా, జల్గావ్‌ సహా మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో శనివారం నుండి వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం 8.30 వరకు 24 గంటల వ్యవధిలో ముంబయిలో 60 మి.మీ కంటే అధిక వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. థానేలో 37.06 మి.మీ వర్షపాతం నమోదైంది. దక్షిణ ముంబయిలోని కొలాబా అబ్జర్వేటరీలో 67 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. శాంతాక్రాజ్‌ అబ్జర్వేటరీలో 64మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది.

➡️