పంజాబ్‌లో రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య అధికం .. ఎన్‌సిఆర్‌బి నివేదిక

Dec 11,2023 08:13 #NCRB data, #Punjab, #road accidents

చంఢీఘర్  :    పంజాబ్‌లో 2021 -2022లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికంటే మృతుల సంఖ్య అధికంగా ఉన్నట్లు ఓ నివేదిక తెలిపింది. పొరుగున ఉన్న హర్యానాతో పోలిస్తే.. పంజాబ్‌లో రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య అధికంగా ఉందని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) ఆదివారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది.

పంజాబ్‌లో గతేడాది 6,122 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా, 4,688 మంది మరణించగా, 3,372 మంది గాయపడ్డారు. 2021లో 6,097 రోడ్డు ప్రమాదాల్లో 4,516 మంది మరణించగా, 3,034 మంది గాయపడ్డారు. హర్యానాలో 2021లో 10,049 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా, ఆ సంఖ్య 2022లో స్పల్పంగా 10,654కి పెరిగింది. 2021లో హర్యానాలో 4,983 మంది మరణించగా, 2022లో 5,228 మంది మరణించారు. ఈ ప్రమాదాల్లో రెండేళ్లలో వరుసగా 7,972 మంది, 8,353 మంది గాయపడ్డారు. నివేదిక ప్రకారం.. హర్యానాలో 2022లో ఎస్‌యువి, కార్ల ప్రమాదాల్లో 660 మంది మరణించగా, 1,398 మంది గాయపడ్డారు. ఆదే ఏడాది పంజాబ్‌లో 1,101 మరణించగా, 861 మంది గాయాలపాలయ్యారు. అయితే రెండు రాష్ట్రాల్లోనూ మోటార్‌ బైక్‌ ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది.

గతేడాది బైక్‌ ప్రమాదాల్లో 2,182 మంది మృతిచెందగా, 3,420 మంది గాయపడ్డారు. పంజాబ్‌లో 2,099 మంది మరణించగా, 1,663 మంది గాయాలపాలయ్యారు. అలాగే సైకిల్‌ ప్రమాదాల్లో పంజాబ్‌లో 215 మంది మరణించగా, 112 మంది గాయపడ్డారు. హర్యానాలో 114 మంది మరణించగా, 120 మంది గాయాలపాలయ్యారు. దీంతో పంజాబ్‌ ప్రభుత్వం ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక బృందాన్ని నియమించాలని నిర్ణయించింది. సడక్‌ సురాఖ్య ఫోర్స్‌ (రోడ్‌ సేఫ్టీ ఫోర్స్‌) సిబ్బందిని మోహరిస్తున్నామని అధికారులు తెలిపారు.

➡️