ఉత్తరాఖండ్‌లో ఘోరం-నదిలో టెంపో పడి 10మంది మృతి

ఉత్తరాఖండ్‌ : ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌ జాతీయ రహదారి పక్కనే వున్న అలకనంద నదిలో ఒక వాహనం పడిపోవడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. రుద్రప్రయాగ్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో హైవేపై రతౌలీ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రుద్రప్రయాగ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫీసర్‌ నందన్‌సింగ్‌ రాజ్వార్‌ తెలిపిన వివరాల ప్రకారం… 23 మందితో వెళ్తున్న టెంపో అదుపు తప్పి శనివారం ఉదయం 11 గంటల సమయంలో అలకనంద నది ఒడ్డున పడిపోయింది. 250 మీటర్ల దిగువకు పడిపోవడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు, పోలీసులు, అధికారులు, డిడిఆర్‌ఎఫ్‌, ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గన్నాయి. టెంపో నుంచి క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చి, జిల్లా ఆసుపత్రిలో చేర్చాయి. వారిలో పరిస్థితి విషమంగా ఉన్న వారిని విమానంలో రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలిస్తున్నట్లు ఉత్తరాఖండ్‌ సిఎం పుష్కర్‌సింగ్‌ ధామి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన క్షతగాత్రులకు అవసరమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

➡️