కేంద్ర సాయుధ బలగాల ఏకీకృతం

  • సిఎపిఎఫ్‌ విలీనానికి యోచన
  •  సూచన ప్రాయంగా వెల్లడించిన అజిత్‌ దోవల్‌

న్యూఢిల్లీ : ఇప్పటికే అగ్నివీర్‌ పథకాన్ని తీసుకొచ్చి ఆర్మీలో అనిశ్చితిని, యువ సైనికుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర సాయుధ బలగాలన్నిటిని ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చి, పూర్తిగా తన చెప్పు చేతల్లో పెట్టుకునేందుకు పథక రచన చేస్తోంది. దీనిలో భాగంగానే కేంద్ర సాయుధ బలగాలు (సిఎపిఎఫ్‌)ను విలీనం చేసేందుకు జోరుగా పావులు కదుపుతోంది. జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఎ) అజిత్‌ దోవల్‌ శుక్రవారం సూచన ప్రాయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. జాయింట్‌ థియేటర్‌ కమాండ్‌ ఆధారంగా సెంట్రల్‌ ఆర్మడ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (సిఎపిఎఫ్‌)ను విలీనం చేయాలనే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బిఎస్‌ఎఫ్‌) ఇన్వెస్టిచర్‌ వేడుక, రుస్తమ్‌ జీ స్మారక ఉపన్యాసంలో మాట్లాడుతూ అజిత్‌ దోవల్‌్‌ ఈ విషయాన్ని తెలిపారు. సిఎపిఎఫ్‌లు లేదా పారామిలిటరీలో ‘సమైక్యత’ అవసరమని అన్నారు. ఇలాంటి చర్యతో డబ్బు ఆదా చేయడం మాత్రమే కాకుండా యుద్ధం లేదా శాంతి సమయల్లో మొహరింపుల్లో ఏకీకృతను ఇది తీసుకుని వస్తుందని అన్నారు. ఎన్‌ఎస్‌ఎ హోదాలో ఈ విషయాన్ని తాను చెప్పడం లేదని, ఒక పోలీస్‌ అధికారిగానే ఈ సూచన చేస్తున్నానని థోవల్‌ పేర్కొన్నారు. ‘సెంట్రల్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్స్‌, సిఎపిఎఫ్‌ల్లో విలీనం గురించి మనం ఆలోచించాలి. మేం ఇప్పుడు ఎంతో శక్తివంతంగా ఉన్నాం. ప్రొక్యూర్‌మెంట్‌, కమ్యూనికేషన్‌, ట్రైనింగ్‌, ప్రామాణీకరణ వంటి అనేక విషయాల్లో మనం ఒకే రకమైన ఇంటర్‌-మింగింగ్‌ విధులను నిర్వహిస్తున్నాం. అయితే వేరువేరుగా ఈ పనులన్నీ చేస్తున్నాం. జాయింట్‌ థియేటర్‌ కమాండ్‌ను సైన్యంలో అమలు చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాయుసేనకు చెందిన అధికారి ఆర్మీ, నౌక దళానికి చెందిన బృందాలను కూడా నియంత్రించాలంటే చాలా కష్టం. ఎందుకంటే వారి పరికరాలు, వ్యూహాలు, ఆదేశాలు, నియంత్ర వ్యవస్థలు వేరువేరుగా ఉంటాయి’ అని ధోవల్‌ అన్నారు. అయితే సిఎపిఎఫ్‌లో విధులు ఒకే విధంగా ఉంటాయని చెప్పారు. అలాగే, ‘యుద్ధం లేదా శాంతి సమయాల్లో మన అవసరాలు ఎలా ఉన్నా. మనం 30 బెటాలియన్ల సిఎపిఎఫ్‌లను మొహరించాలి. సరిహదుల్లో ఒకవేళ బిఎస్‌ఎఫ్‌ అందుబాటులో లేకపోతే, సిఆర్‌పిఎఫ్‌లు కూడా ఈ విథులను నిర్వహించాలి. ఎందుకంటే వారు సుశిక్షితులు. వారి పరికారాలు, కమ్యూనికేషన్‌ వస్తువులు ఒక విధంగా ఉంటాయి. ఒక బృందంలో కొంతమంది సిఆర్‌పిఎఫ్‌, కొంతమంది బిఎస్‌ఎఫ్‌ సిబ్బంది ఉన్నా ఫరవాలేదు. వారు కలిసిపోగలరు’ అని థోవల్‌ తెలిపారు. అలాగే దేశంలో భారీ సంఘటన జరినప్పుడు మనం అంతర్గత భద్రత కోసం బిఎస్‌ఎఫ్‌ మొహరించడం గురించి ఆలోచించాలి’ అని కూడా ధోవల్‌ చెప్పారు.
సిఎపిఎఫ్‌ను విలీనం చేయాలనే సూచనపై పలువురు మండిపడుతున్నారు. ఇది సైన్యంపై నిరంకుశత్వానికి దారి తీస్తుందని, సైన్యంలో నిష్పాక్షితను దూరం చేస్తుందని విమర్శిస్తున్నారు. కాగా, సుమారు పది లక్షల మంది సిబ్బంది ఉన్న సిఎపిఎఫ్‌ల్లో బిఎస్‌ఎఫ్‌, సిఆర్‌పిఎఫ్‌, ఐటిబిపి, సిఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బి, అస్సాం రైఫిల్స్‌ వంటి విభాగాలు ఉన్నాయి. బిఎప్‌ఎఫ్‌ను ఎక్కువగా పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల వెంబడి మోహరిస్తున్నా .. 2009 నుంచి వామపక్ష తీవ్రవాద ప్రభావ ప్రాంతాల్లోనూ మొహరిస్తుంది. సిఆర్‌పిఎఫ్‌ను అంతర్గత భద్రతా విధుల కోసం వినియోగిస్తున్నారు. ఈశాన్య, జమ్ముకాశ్మీర్‌ రాష్ట్రాల్లో ఎక్కువగా మోహరిస్తున్నారు. ఐటిబిపిను చైనా సరిహదుల వెంబడి మోహరిస్తున్నారు. సెంట్రల్‌ ఇండిస్టియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సిఐఎస్‌ఎఫ్‌)కు పాత్ర ప్రభుత్వ ఇన్‌స్టాలేషన్‌లను రక్షించడం, విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్స్‌ వద్ద మోహరించడం వంటి విథులు కేటాయించారు. సశాస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బి) నేపాల్‌, భూటాన్‌ సరిహద్దులను రక్షిస్తుంది. మయన్మార్‌తో సరిహద్దుల వెంబడి అస్సాం రైఫిల్స్‌ మోహరించి ఉంది. సిఎపిఎఫ్‌లో నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్‌డిఆర్‌ఎఫ్‌), నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌సిజి) కూడా ఉన్నాయి.

➡️