ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేశారు

  • ఇది  రాజ్యాంగ విరుద్ధం
  •  మతం, ప్రభుత్వం మధ్య రేఖ పలచబడుతోంది
  •  అయోధ్య ప్రాణ ప్రతిష్టపై పినరయి విజయన్‌
  • లౌకికవాద పరిరక్షణకు పునరంకితం కావాలని పిలుపు

ప్రజాశక్తి ప్రతినిది-  తిరువనంతపురం :    భారతదేశ లౌకికవాద భావజాలానికి, రాజ్యంగ సూత్రాలకు, విలువలకు పునరంకితం కావాల్సిందిగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. లౌకికవాదం భారత రిపబ్లిక్‌కు ఆత్మ వంటిదని, మన జాతీయోద్యమ రోజుల నుండి మన గుర్తింపులో ఇది భాగంగా ఉందని అన్నారు. వివిధ మత విశ్వాసాలకు చెందిన వారు, ఏ మతానికి చెందని వారు కూడా ఆనాడు మన స్వాతంత్రోద్య మంలో భాగస్వాములయ్యారని, ఈ దేశం భారత సమాజం లోని అన్ని వర్గాల ప్రజలదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పేర్కొన్నారు. అయోధ్యలోని రామ మందిరంలో బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగిన వెంటనే ఆయన ఒక సందేశాన్ని విడుదల చేశారు. మతాన్ని ప్రభుత్వంతో విడదీసే రేఖ రాన్రానూ సన్నబడి పోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

భారతదేశ లౌకికవాదమంటే మతం, ప్రభుత్వం మధ్య స్పష్టమైన విభజన అని అర్ధమంటూ ఆనాడు భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఉద్ఘాటించిన దానికి ఇది పూర్తి విరుద్ధంగా వుందని అన్నారు. పైగా ఇప్పటివరకు ఆ విభజనను బలంగా ఆచరించిన సాంప్రదాయం కూడా మనకు వుందని అన్నారు. కానీ ఈనాడు దేశంలో ఒక ఆరాధనా స్థలానికి సంబంధించిన మతపరమైన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించిన దశలో మనం వున్నామని విజయన్‌ పేర్కొన్నారు. చాలామందిని ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కూడా ఆలయ ట్రస్టు ఆహ్వానాలు పంపిందని అన్నారు. కానీ, మన రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని, కాపాడతామని ప్రతిన చేసిన వారిగా మనందరం ఈనాడు దేశ లౌకిక స్వభావానికి పునరంకితం కావాలని విజయన్‌ ఫునరుద్ఘా టించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి  నిరాకరించడం ద్వారా మన రాజ్యాంగ బాధ్యతలను పరిరక్షించాలన్నారు. మతమనేది వ్యక్తిగత వ్యవహారం, ఈ దేశ ప్రజలు తమకు నచ్చిన మతాన్ని ఆచరించే, ప్రచారం చేసే పూర్తి స్వేచ్ఛ వుందని భారత రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంటోంది. భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేసిన వారందరూ మన పరిధుల్లోని ప్రతి ఒక్క వ్యక్తి ఈ హక్కును అనుభవించేలా చూడాల్సి వుంది. అదే సమయంలో ఒక మతాన్ని ఎక్కువ చేయడం, మరో మతాన్ని కించపరచడం చేయరాదని అన్నారు. మత, భాషా, ప్రాంతీయ లేదా వర్గాల వారీ వైవిధ్యతలను అధిగమించడం ద్వారా భారతదేశ ప్రజలందరిలో సోదర భావాన్ని, సామరస్యతను పెంపొందించడానికి రామమందిర ప్రారంభోత్స వాన్ని ఒక అవకాశంగా తీసుకుని మనం పనిచేయాల్సి వుందని విజయన్‌ ఆ సందేశంలో పేర్కొన్నారు. శాస్త్రీయన దృక్పథాన్ని, మానవతా వాదాన్ని, విచారణా స్ఫూర్తి, మరియు సంస్కరణలను అభివృద్ధిపరుచుకోవడంపైనే భారతదేశం అభివృద్ధి, సంక్షేమం ఆధారపడి వుందని విజయన్‌ స్పష్టం చేశారు.

➡️