పుట్టబోయే బిడ్డ ఎవరో నిర్ణయించేది పురుష క్రోమోజోమ్‌లే !

Jan 12,2024 10:43 #male chromosomes
  • సమాజంలో దీనిపై అవగాహన పెరగాలి
  • వరకట్న హత్య కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : పుట్టబోయే బిడ్డ ఆడ, మగా అని నిర్ణయించేది పురుషుడి క్రోమోజోమ్‌లే తప్ప మహిళవి కావన్న విషయంపై సమాజంలో అవగాహన, చైతన్యం తీసుకురావాల్సిన అవసరం వుందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. తమ ఇంటికి వచ్చిన కోడలు తమ వంశ వృక్షాన్ని నిలపాలనే భావించే అత్తమామలు అందుకు మూల కారణం తమ కొడుకే తప్ప కోడలు కాదన్న విషయం తెలుసుకోవాల్సి వుందని పేర్కొంది. ఒక మహిళ వరకట్న మృతి కేసు విచారణ సందర్భంగా హైకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. తగిన కట్నం తీసుకురాకుండా ఇద్దరు కుమార్తెలకు జన్మనిచ్చిందన్న కారణంతో భర్త, అత్తమామలు పెట్టిన వేధింపులతో ఆ బాధితురాలు చనిపోయింది. నేటి సమకాలీన సమాజంలో మహిళ విలువను భౌతిక పరిగణనలతో ముడిపెట్టాలనే ఆలోచన సమానత్వం, గౌరవం వంటి సూత్రాలకు పూర్తి విరుద్ధంగా వుందని కోర్టు పేర్కొంది. తిరోగమన దృక్పథంతో కూడిన మనస్తత్వాలు, వరకట్నం కోసం పట్టుబట్టి, ఎంతకైనా తెగించే సంఘటనలు చూస్తుంటే విశాల దృక్పథంతో కూడిన సామాజిక ఆందోళన అవసరాన్ని నొక్కి చెబుతోంది. వివాహితలు ఎదుర్కొంటున్న సవాళ్ళు ఈ విషయాన్ని ప్రముఖంగా చెబుతున్నాయి. మహిళల విలువ, వారి గౌరవమనేది ధన దాహంతో అత్తమామలు చేసే కట్నం డిమాండ్లను నెరవేర్చలేని తల్లిదండ్రుల సామర్ధ్యాలపై ఆధారపడరాదని జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మ పేర్కొన్నారు. అత్తమామల ఇంట్లో అందరి ప్రేమ, మద్దతు తమ కూతురు పొందాలని తల్లిదండ్రులు ఆశిస్తారని, కానీ పెళ్ళికూతురు అంతులేని ఆశ, అరాచకంతో అత్తమామల కుటుంబం పెట్టే ఆరళ్ళను, వేధింపులను ఎదుర్కొంటుడడం ఆందోళన కలిగిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వరకట్న వేదింపులకు తోడు, ఆడపిల్లలకు జన్మనివ్వడం వేధింపులకు మరో కారణమవుతోందని పేర్కొంది. ఆడపిల్ల పుట్టడం కేవలం కోడలి తప్పే అన్నట్లు ఆమెను పూర్తిగా బాధ్యురాలిని చేస్తున్నారని, ఇందుకు సంబంధించి జన్యు శాస్త్రం చెప్పే వాస్తవాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొంది. పురుషుడిలో ఎక్స్‌, వై క్రోమోజోమ్‌లు వుంటాయి, మహిళల్లో రెండు ఎక్స్‌ క్రోమోజోమ్‌లు వుంటాయి, పురుషుడి వీర్యం తీసుకువచ్చే క్రోమోజోమ్‌ను బట్టి పుట్టేది ఆడపిల్లా, మగపిల్లవాడా అనేది నిర్ణయించబడుతుందని, ప్రజల్లో ఈ మేరకు అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా వుందని హైకోర్టు పేర్కొంది. ఈనాటి ఈ తీర్పుతోనైనా అటువంటి చైతన్యం మొదలైతే ప్రజల మనస్తత్వాల్లో మార్పు రావడానికి చాలా కాలం పడుతుందని జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మ పేర్కొన్నారు. ఈ వరకట్న కేసుల్లో భర్తకు బెయిల్‌ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది.

➡️