K-Rice: భారత్‌ రైస్‌కు పోటీగా కె-రైస్‌!

  • కిలో రూ.30చొప్పున విక్రయాలు

తిరువనంతపురం : కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న భారత్‌ రైస్‌కు పోటీగా శబరి కె-రైస్‌ను ప్రవేశపెట్టాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి జి.ఆర్‌.అనీల్‌ బుధవారం ఇక్కడ జరిగిన పత్రికా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. సప్లై కో కేంద్రాల ద్వారా ప్రజలకు సరసమైన ధరలకు మంచి నాణ్యత గల బియ్యాన్ని అందించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ పథకాన్ని ఆరంభించినట్లు మంత్రి తెలిపారు. దీనితో పాటూ ప్రస్తుతం సప్లై కో నుండి కార్డుకు పది కిలోల చొప్పున సబ్సిడీ ధరలకు ఇస్తున్న బియ్యం పంపిణీ కూడా కొనసాగుతుందని మంత్రి చెప్పారు. కె-రైస్‌ అనేది కూడా అందులో భాగంగానే వుంటుందన్నారు. కిలో రూ.40 చొప్పున ప్రభుత్వం వివిధ రకాల బియ్యాన్ని కొనుగోలు చేస్తుంది. వాటిని రూ.30 చొప్పున సబ్సిడీ రేట్లకు విక్రయిస్తుంది. జయా రైస్‌ ధర రూ.29గా నిర్ధారించగా, కురువు, మట్టా రకాలు రూ.30కి అందుబాటులో వుంటాయి. జయా వెరైటీ బియ్యం తిరువనంతపురం ప్రాంతంలోనే విక్రయిస్తారు. మట్టా వెరైటీని కొట్టాయం, ఎర్నాకుళం ప్రాంతాల్లో, కురువ రకాన్ని పాలక్కాడ్‌, కొజిక్కోడ్‌ ప్రాంతాల్లో అందుబాటులో వుంటాయని మంత్రి చెప్పారు. ఒక బ్రాండ్‌ను ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా మొదటి దశలో శబరి కె-రైస్‌ను ఆ లోగో గల గోనె సంచుల్లో విక్రయిస్తారు. మొత్తంగా ఈ గోనె సంచులకయ్యే బడ్జెట్‌ రూ.10లక్షల ల్లోపే వుంటుందని, దాన్ని సప్లై కో అడ్వర్టయిజ్‌మెంట్స్‌ బడ్జెట్‌ నుండి వాడతామని చెప్పారు. కె-రైస్‌ బ్రాండ్‌ కింద సబ్సిడీ రేట్లకు అధిక నాణ్యత గల వెరైటీలను అందచేస్తుండగా, నాఫెడ్‌ ద్వారా కిలో రూ18.59కు, ఎన్‌సిసిఎఫ్‌ ద్వారా కిలో రూ.29 చొప్పున కొనుగోలు చేసి వాటిని రూ.29 చొప్పున భారత్‌ రైస్‌గా విక్రయిస్తున్నారని మంత్రి చెప్పారు. భారత్‌ రైస్‌ పేరుతో ప్రజలకు విక్రయించడం ద్వారా కేంద్రం కిలోకు రూ.10చొప్పున లాభం పొందుతోందన్నారు. అదే సమయంలో కె-రైస్‌ను విక్రయించేందుకు కిలోకు రూ.9.5 నుండి 11.11 వరకు అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని మంత్రి అనీల్‌ చెప్పారు.

  • కేరళలోనూ డబ్బావాలా తరహా సేవలు 

లంచ్‌ బెల్‌ ప్రాజెక్టు ప్రారంభించిన పినరయి విజయన్‌ ప్రభుత్వం 

యాప్‌ ద్వారా ఆర్డర్లు, రూ.60కే భోజనం

తిరువనంతపురం : ముంబయిలో ప్రసిద్ధి చెందిన డబ్బావాలాల తరహా సేవలను కేరళలోనూ ప్రారంభించారు. కుదుంబశ్రీ ‘లంచ్‌ బెల్‌’ ప్రాజెక్టును తిరువనంతపురంలో రాష్ట్ర స్థానిక స్వపరిపాలనా సంస్థల శాఖ మంత్రి ఎం.బి.రాజేష్‌ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసిన మహిళలతో కూడిన మొదటి ఫుడ్‌ డెలివరీ బృందం మొదటి ప్రయాణాన్ని కూడా మంత్రి ప్రారంభించారు. కుదుంబశ్రీ మౌలిక లక్ష్యాలపై దృష్టి పెట్టడం ద్వారా కుదుంబశ్రీ సభ్యుల ఆర్థిక సాధికారతతో పాటూ వారి ఆదాయాలు పెంచే చర్యలను అమలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రాజెక్టు ప్రారంభంతో కుదుంబశ్రీ వలంటీర్లు ఫుడ్‌ డెలివరీ యాప్‌ అయిన పాకెట్‌ మార్ట్‌ ద్వారా ఆఫీసులకు లంచ్‌ బాక్స్‌లను పంపిణీ చేయడం ఆరంభించారు. ఉదయం 7గంటల వరకు ఆర్డర్లు తీసుకుంటారు. మధ్యాహ్నం 12గంటల కల్లా లంచ్‌ బాక్స్‌లు అందచేస్తారు. తిరిగి 2గంటల కల్లా వలంటీర్లు లంచ్‌ బాక్స్‌లను తీసుకెళ్ళిపోతారు. మూడు స్థాయిల్లో పరిశుభ్రమైన పద్ధతుల్లో కడిగిన తర్వాత మళ్లీ ఆ లంచ్‌బాక్స్‌లను ఉపయోగిస్తారు.బడ్జెట్‌ లంచ్‌ బాక్స్‌ ఖరీదు రూ.60. తొలి దశలో లంచ్‌ బెల్‌ ప్రాజెక్టును తిరువనంతపురంలో సెక్రటేరియల్‌, అసెంబ్లీ, వికాస్‌ భవన్‌, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో అమలు చేస్తారు. రాబోయే కాలంలో గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తారు. ఈ పాకెట్‌ మార్ట్‌ యాప్‌ ద్వారా భోజనాలతో పాటూ ఇతర ఆహార పదార్ధాలకు కూడా డిమాండ్‌ వుందని కుదుంబశ్రీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జాఫర్‌ మాలిక్‌ తెలిపారు.

➡️