neet scam: సుప్రీం నియమించిన ఆధికారులతో విచారణ : కపిల్‌ సిబాల్‌ డిమాండ్‌

న్యూఢిల్లీ : నీట్‌ స్కామ్‌పై సుప్రీంకోర్టు నియమించిన అధికారులతో విచారణ జరగాలని రాజ్యసభ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబాల్‌ కోరారు. భవిష్యత్‌లో నీట్‌ పరీక్షను ఎలా నిర్వహించాలనే విషయంపై అన్ని రాష్ట్రాలతో కేంద్రప్రభుత్వం సంప్రదింపులు జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నీట్‌ పరీక్షా విధానం అవినీతిమయమైందని వార్తలు వస్తున్నప్పుడు మన్నుతిన్నపాములా మిన్నకుండిపోవడం ప్రధాన మంత్రికి తగదని అన్నారు. త్వరలో జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ అంశాన్ని బలంగా లేవనెత్తాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై చర్చకు మోడీ ప్రభుత్వం అనుకూలంగా ఉంటుందన్న నమ్మకం తనకు లేదని అన్నారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ)పై ప్రస్తుతం అనేక ఆరోపణలున్నాయని, దాని అవినీతిని మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌ వెలుగులోకి తెచ్చాయని చెప్పారు. గుజరాత్‌లో జరిగిన కొన్ని సంఘటనలు తనతోపాటు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయని, ఇలాంటి తీవ్రమైన అంశాలకు ఎన్‌టిఎ సమాధానం ఇవ్వాలని చెప్పారు. హెచ్‌ఆర్‌డి మంత్రిగా గతంలో తాను పనిచేసినప్పటికీ, నీట్‌తో తనకు ఎటువంటి సంబంధంలేదని అన్నారు. ఎంబిబిఎస్‌ కోర్సులో ప్రవేశం పొందే విద్యార్థులకు జాతీయస్థాయి అర్హత పరీక్ష ఉండాలని మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసిఐ) బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల సిఫార్సుల మేరకు నీట్‌ ప్రవేశపెట్టారని చెప్పారు. ఎంసిఐకు ఇలాంటి సామర్థ్యం లేదని దాఖలైన కొన్ని పిటీషన్ల విచారణ తరువాత సుప్రీంకోర్టు 2016లో నీట్‌ను సమర్థించిందని కపిల్‌ సిబాల్‌ గుర్తు చేశారు. ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ యాక్ట్‌ 1956 చట్టం స్థానంలో 2019 ఆగస్టున నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ యాక్ట్‌ను ఆమోదించారని చెప్పారు. ఈ చట్టాన్ని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దీనికి యుపిఎతో ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. నీట్‌ పరీక్షల్లో పేపర్‌ లీక్‌ లేదా స్కామ్‌ జరగలేదని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తప్పు జరిగిందని అంగీకరించే మంత్రి మోడీ మంత్రివర్గంలోనే లేడని అన్నారు. నీట్‌ స్కామ్‌పై సమగ్ర విచారణ అవసరమని చెప్పారు. సిబిఐ విచారణ ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వాన్ని రక్షిస్తుందని, కాబట్టి స్వతంత్ర సంస్థ లేదా సుప్రీంకోర్టు నియమించిన అధికారుల ద్వారా విచారణ అవసరమని అన్నారు. 140 కోట్ల జనాభా, సంక్లిష్టమైన సామాజిక వ్యవస్థ ఉన్న దేశంలో మోడీ ప్రభుత్వం ప్రతి విషయాన్నీ కేంద్రీకృతం చేస్తుందని విమర్శించారు. మెడిసిన్‌ ప్రవేశాలు ఎలా ఉండాలనే అంశంపై కేంద్రప్రభుత్వం ప్రతి రాష్ట్రాన్నీ సంప్రదించి ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలని కపిల్‌ సిబాల్‌ కోరారు.

➡️