ముంబయి విమానాశ్రయంలో తప్పిన ప్రమాదం

Jun 9,2024 18:03 #Mumbai airport, #Two planes

ముంబయి : ముంబయి విమానాశ్రయం (ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌)లో పెద్ద ప్రమాదం తప్పింది. శనివారం తెల్లవారుజామున ఇండోర్‌ విమానాశ్రయం నుండి వస్తున్న ఇండిగో విమానం 5053 రన్‌వే 27పై ల్యాండ్‌ అయ్యేందుకు సిద్ధమవుతుండగా, ఎయిర్‌ ఇండియా విమానం 657 తిరువనంతపురం వెళ్లేందుకు టేకాఫ్‌ అవుతోంది. రెండు విమానాల మధ్య కొన్ని వందల మీటర్ల దూరం ఉందని,  పెద్ద ప్రమాదం తప్పిందని  అధికారులు తెలిపారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 

అయితే తాము ఎటిసి సూచనలను తూచా తప్పకుండా పాటించామని ఇండిగో, ఎయిర్‌ ఇండియాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. దీంతో ఈ ఘటనపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డిజిసిఎ) దర్యాప్తుకు ఆదేశించింది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఎటిసి) సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది.

ముంబయి, ఢిల్లీ విమానాశ్రయాలు నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. గంటకు 46 విమానాలు నడుస్తుంటాయి. విమానాల ల్యాండింగ్‌, టేకాఫ్‌కు ఎటిసి సిబ్బంది బాధ్యత వహిస్తారు. ఈ ఘటనలో ఇండిగో విమానం ల్యాండ్‌ అవుతున్న సమయంలో టేకాఫ్‌ అయిన ఎయిర్‌ ఇండియా విమానం బి2 స్పీడ్‌కు చేరుకుందని ఎటిసి గిల్డ్‌ ఇండియా జనరల్‌ సెక్రటరీ అలోక్‌ యాదవ్‌ తెలిపారు. ఈ ఘటన దర్యాప్తులో ఉందని అన్నారు.

➡️