మాయమైపోతున్నారు..

Dec 13,2023 10:41 #Crimes, #Crimes Against Children
missing cases in bjp govt

దేశంలో 47 వేల మంది చిన్నారుల అదృశ్యం
వారిలో 71 శాతం మంది

బాలికలేబేటీ బచావో..బేటీ పడావో అంటున్న మోడీ పాలనలో మాయమైపోతున్నారు. కనీసం వారు ఎక్కడ ఉన్నారు..ఎలా ఉన్నారు. అసలు ప్రాణాలతో బతికే ఉన్నారా..లేదో తెలియక తలిదండ్రులు లోలోన కుమిలిపోతున్నారు. తాజాగా ఎన్సీఆర్బీ విడుదల చేసిన నివేదికల్ని పరిశీలిస్తే..ఆ కుటుంబాలు ఎంతగా ఆవేదన చెందుతున్నాయో స్పష్టమవుతోంది.న్యూఢిల్లీ : దేశంలో 2018 తర్వాత అదృశ్యమైపోతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తాజా నివేదిక ప్రకారం 47 వేల మంది చిన్నారుల ఆచూకీ తెలియడం లేదు. వారిలో 71.4 శాతం మంది మైనర్‌ బాలికలేనని ఆ నివేదిక తెలిపింది. కనిపించకుండా పోయిన బాలబాలికల సంఖ్య 2022తో కలిపి ఐదు సంవత్సరాల కాలంలో బాగా పెరిగింది. 2021తో పోలిస్తే 2022లో వీరి సంఖ్య 7.5 శాతం పెరిగింది. 2020లో కంటే 2021లో 30.8 శాతం పెరిగింది. అయితే 2019తో పోలిస్తే 2020లో 19.8 శాతం తగ్గింది. కానీ 2018లో కంటే 2019లో 8.9 శాతం, 2017తో పోలిస్తే 2018లో 5.6 శాతం పెరిగింది. ఆచూకీ తెలియకుండా పోయిన చిన్నారులలో ఆయా రాష్ట్రాల అధికారులు కొందరి ఆచూకీ తెలుసుకున్నప్పటికీ గణాంకాలలో తేడా మాత్రం అధికంగానే ఉంది. భారత్‌లో జరిగిన నేరాలపై ఎన్‌సీఆర్‌బీ ఈ నెల 3న తన వార్షిక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం గత సంవత్సరంలో 20,380 మంది బాలురు, 62,946 మంది బాలికలు, 24 మంది ట్రాన్స్‌జెండర్లు (మొత్తం 83,350 మంది) కనిపించకుండా పోయారు. మొత్తంమీద 20,254 మంది బాలురు, 60,281 మంది బాలికలు, 26 మంది ట్రాన్స్‌జెండర్ల (మొత్తం 80,561 మంది) ఆచూకీ లభించింది. ఆచూకీ తెలియకుండా పోయిన చిన్నారులకు సంబంధించి పాటిస్తున్న ప్రామాణిక నిబంధనల ప్రకారం…మైనర్‌ బాలుడు లేదా బాలిక కన్పించడం లేదన్న సమాచారం అందుకున్న తర్వాత పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి, నిర్ధారించుకుంటారు. ఐపీసీ సెక్షన్‌ 363 (కిడ్నాప్‌) కింద కేసు నమోదు చేస్తారు. 2022లో కిడ్నాప్‌కు గురైన 76,069 మంది పిల్లల్లో 62,099 మంది బాలికలే. కిడ్నాప్‌కు గురైన వారిలో (ఐదు సంవత్సరాలలో కలిపి) 51,100 మంది మైనర్ల ఆచూకీ తెలియలేదు. వీరిలో 40,219 మంది అంటే 78.7 శాతం మంది బాలికలు. కన్పించకుండా పోయిన పిల్లల కేసుల్ని కిడ్నాపింగ్‌ కేసుల కేటగిరీలో చేరుస్తారు. ఈ కేటగిరీ కింద 2020లో 29,364, 2019లో 29,243, 2018లో 24,429 కేసులు నమోదయ్యాయి. అదృశ్యమైపోయిన చిన్నారుల విషయంలో మరింత దృష్టి సారించాలని ఢిల్లీ మాజీ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌ఎన్‌ శ్రీవాత్సవ చెప్పారు. వీధుల్లో తిరిగే చిన్నారులు కిడ్నాపర్లకు లక్ష్యంగా మారుతున్నారని, వారిని అపహరించి విక్రయించడమో, వ్యభిచారంలోకి దించడమో లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వాడుకోవడమో జరుగుతోందని తెలిపారు. ఆచూకీ తెలియని చిన్నారులను వెతికి పట్టుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కన్పించకుండా పోయిన చిన్నారుల ఆచూకీని కనిపెట్టడంలో విజయం సాధించిన పోలీస్‌ సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించాలని అన్నారు. కాగా ఇలాంటి కేసుల విచారణలో తొలి 24 గంటలే కీలకమని స్వచ్ఛంద సంస్థ శక్తి వాహినిలో పని చేస్తున్న సామాజిక కార్యకర్త రిషి కాంత్‌ చెప్పారు. అదృశ్యమవుతున్న చిన్నారుల సంఖ్య పశ్చిమబెంగాల్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో అధికంగా ఉంది. గత సంవత్సరం బెంగాల్‌లో అత్యధికంగా 12,455 మంది ఆచూకీ తెలియకుండా పోగా 11,352 మంది చిన్నారులతో మధ్యప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచింది. 2021, 2020, 2019, 2018 సంవత్సరాలలో మాత్రం మధ్యప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉండగా బెంగాల్‌ ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. 2022లో కనిపించకుండా పోయిన వారిలో ఇప్పటి వరకూ ఆచూకీ దొరకని చిన్నారుల సంఖ్య విషయంలో కూడా పశ్చిమబెంగాల్‌ తొలి స్థానంలో, మధ్యప్రదేశ్‌ రెండో స్థానంలో ఉన్నాయి. బీహార్‌, ఢిల్లీ రాష్ట్రాలలో కూడా అదృశ్యమైన పిల్లల సంఖ్య ఎక్కువగానే ఉంది.

➡️