‘గుల్‌మార్గ్‌’ను ఇలా ఎన్నడూ చూడలేదు : ఒమర్‌ అబ్దుల్లా

 శ్రీనగర్‌  :   జమ్ముకాశ్మీర్‌లోని ‘గుల్‌మార్గ్‌’ను ఇలా ఎప్పుడూ చూడలేదని జమ్ముకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా బుధవారం వ్యాఖ్యానించారు. ”శీతాకాలంలో గుల్‌మార్గ్‌లో ఇంతటి పొడి వాతావరణం ఎన్నడూ చూడలేదు. మంచు కురవకపోతే వేసవి మరింత దుర్భరంగా ఉంటుంది ’’ అని  ఆందోళన వ్యక్తం చేశారు.  ‘‘నాలాగే మంచులో స్కీయింగ్‌ చేయాలనుకునే వారు ఎక్కువ కాలం వేచి ఉండలేరు. మంచు లేకపోతే స్కీయింగ్‌ చేసేందుకు అవకాశం ఉండదు ’’ అని అన్నారు.

2022, 2023లో గుల్‌మార్గ్‌లో దిగిన ఫోటోలను ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఇక్కడి పరిస్థితిని వివరించేందుకు గత రెండేళ్లలో జనవరి 6వ తేదీన దిగిన ఫొటోలను షేర్‌ చేస్తున్నా అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

గుల్‌మార్గ్‌ అంతా కొండవాలులతో మంచుతో కప్పబడి స్కీయింగ్‌ చేసేందుకు అనువుగా ఉంటుంది. ఈ సీజన్‌లో స్కీయింగ్ చేసేందుకు  పర్యాటకులు అధికంగా ఇక్కడికి వస్తుంటారు. వాతావరణ మార్పులతో ఇక్కడ మంచు కురవకపోవడంపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పట్టణం నిర్మానుష్యంగా మరియు పొడిగా కనిపిస్తుండగా, భూమిపై చాలా తక్కువ మంచు  మాత్రమే ఉన్న  దృశ్యాలను  ఈ నెల 8న జాతీయ మీడియా ఓ  పోస్ట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. గుల్‌మార్గ్‌ మాత్రమే కాదు, కాశ్మీర్‌లోని పహల్‌గామ్‌తో పాటు హిమాచల్‌ ప్రదేశ్‌ మరియు ఉత్తరాఖండ్‌  ప్రాంతాల్లో  కూడా సగటు కంటే తక్కువ హిమపాతం నమోదైంది.

 

 

➡️