New Criminal Code : తోపుడుబండి వ్యాపారిపై మొదటి ఎఫ్‌ఐఆర్‌

న్యూఢిల్లీ  :  భారతీయ న్యాయ సంహిత -2023 (బిఎన్‌ఎస్‌) కింద ఢిల్లీ పోలీసులు సోమవారం మొదటి ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. తోపుడు బండి (హాకర్‌)పై వస్తువులు విక్రయించుకునే ఓ వ్యక్తిపై ఈ కేసు నమోదు చేయడం గమనార్హం. దేశ వ్యాప్తంగా ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ స్థానంలో జులై 1 నుండి బిఆర్‌ఎస్‌ అమలులోకి రానున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. రైల్వే స్టేషన్‌ సమీపంలో రహదారిని అడ్డుకున్నాడంటూ ఓ తోపుడు బండి వ్యక్తిపై నూతన చట్టంలోని సెక్షన్‌ 285 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రూ. ఐదు వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.

రైల్వేస్టేషన్‌కు సమీపంలోని ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జీ కింద వీధివ్యాపారి రహదారిపై ఆదివారం రాత్రి తన బండిని నిలిపివుంచాడు. వాటర్‌ బాటిల్స్‌, సిగరెట్స్‌, గుట్కాలు విక్రయిస్తున్నాడు. అతని బండి కారణంగా ప్రజలకు ఇబ్బంది కలిగింది. పక్కకు తరలించాలని సబ్‌ఇన్స్‌పెక్టర్‌ ఆదేశించినా పట్టించుకోలేదని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అతని కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను వీడియో తీసి కేసు నమోదు చేసినట్లు పెట్రోలింగ్‌ అధికారులు తెలిపారు. ఆ వ్యక్తిని బీహార్‌కు చెందిన పంకజ్‌ కుమార్‌గా గుర్తించారు.

➡️