పెద్దల సభ నుంచి 68 మంది ఎంపీల నిష్క్రమణ

Jan 5,2024 10:49 #Rajya Sabha, #Union ministers
  •  ఈ ఏడాదిలో ముగియనున్న పదవీకాలం

న్యూఢిల్లీ. :  ఈ ఏడాది రాజ్యసభ నుంచి 68 మంది ఎంపీలు నిష్క్రమించనున్నారు. వీరిలో తొమ్మిది మంది కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి గరిష్టంగా పది సీట్లు ఖాళీ కానున్నాయి. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, హర్యానా, సిక్కిం, ఛత్తీస్‌గఢ్‌లలో కనీసం ఒక సీటు ఖాళీ కానున్నది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సహా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సుధాన్షు త్రివేది కలిపి 68 మంది నేతల పదవీకాలం ముగియనున్నది. పదవీకాలం ముగియనున్న ఎంపీల్లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌, ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండ్యా ఉన్నారు. వీరి పదవీకాలం ఏప్రిల్‌లో పూర్తికానుంది.

ఉత్తరప్రదేశ్‌లో గరిష్టంగా 10 సీట్లు ఖాళీ అవుతాయి. దీని తర్వాత మహారాష్ట్ర, బీహార్‌లో ఆరు, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లో ఐదు, కర్నాటక, గుజరాత్‌లో నాలుగు, ఢిల్లీ, ఒడిశా, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో మూడు చొప్పున, జార్ఖండ్‌, రాజస్థాన్‌లో రెండేసి చొప్పున, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, హర్యానా, సిక్కిం, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్కటి ఖాళీగా ఉంటాయి.

ఢిల్లీలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ జైలు శిక్ష అనుభవిస్తున్న ఆప్‌ నేతలు సంజయ్ సింగ్‌, నారాయణ్‌ దాస్‌ గుప్తా, సుశీల్‌ కుమార్‌ గుప్తాల పదవీకాలం జనవరి 27తో ముగియనుంది. సిక్కింలోని ఏకైక రాజ్యసభ స్థానానికి కూడా ఎన్నికలు జరగనున్నాయి. సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎస్‌డీఎఫ్‌) ఎంపీ హిషే లఛుంగ్పా ఫిబ్రవరి 23న పదవీ విరమణ చేయనున్నారు.పదవీ విరమణ చేస్తున్న సభ్యుల్లో మన్మోహన్‌ సింగ్‌, భూపేంద్ర యాదవ్‌ (రాజస్థాన్‌), అశ్విని వైష్ణవ్‌, బీజేడీ ఎంపీలు ప్రశాంత్‌ నందా, అమర్‌ పట్నాయక్‌ (ఒడిశా), బీజేపీ అధికార ప్రతినిధి అనిల్‌ బలూని (ఉత్తరాఖండ్‌), మన్సుఖ్‌ మాండవ్య, మత్స్యశాఖ మంత్రి పుర్షోత్తం రూపాలా, గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ అమీ యాగ్న్‌తో పాటు నారన్‌భాయ్ రాత్వా కూడా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో…

ఆంధ్రప్రదేశ్‌ నుంచి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌, వైఎస్సార్సీపీ ఎంపీ ప్రభాకర్‌ రెడ్డి వేమిరెడ్డి రాజ్యసభ నుంచి రిటైర్‌ అవుతున్నారు.ఛత్తీస్‌గఢ్‌, హర్యానా నుంచి బీజేపీ ఎంపీలు సరోజ్‌ పాండే, డీపీ వాట్స్‌ పదవీ విరమణ చేస్తున్నారు. జార్ఖండ్‌లో బీజేపీ ఎంపీ సమీర్‌ ఓరాన్‌, కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ ప్రసాద్‌ సాహు మేలో పార్లమెంట్‌ ఎగువ సభ నుంచి పదవీ విరమణ చేస్తున్నారు.

కేరళలో…

కేరళలో సిపిఎం ఎంపీ ఎలమారం కరీం, సీపీఐ ఎంపీ బినోయ్  విశ్వం, కేసీ(ఎం) ఎంపీ జోస్‌ కె మణి జులైలో పదవీ విరమణ చేయనున్నారు. నలుగురు నామినేటెడ్‌ ఎంపీలు కూడా జులైలో పదవీ విరమణ చేయనున్నారు.వీరిలో బీజేపీకి చెందిన మహేశ్‌ జెఠ్మలానీ, సోనాల్‌ మాన్‌సింగ్‌, రామ్‌ షకల్‌, రాకేష్‌ సిన్హా ఉన్నారు.

➡️