ఐఐటి బాంబేలో చదివినా.. నో ప్లేస్‌మెంట్‌

  • 36 శాతం మంది గ్రాడ్యుయేట్ల దుస్థితి
  •  ఆర్థిక మాంద్యమే కారణమంటున్న అర్థికవేత్తలు

న్యూఢిల్లీ : దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటి బాంబేలో గ్రాడ్యుయేట్‌ పట్టాలు పొందిన విద్యార్ధుల్లో కనీసం 36 శాతం మందికి ఉద్యోగాలు రాలేదని గ్లోబల్‌ ఐఐటి పూర్వ విద్యార్ధుల సపోర్ట్‌ గ్రూప్‌ వెల్లడించిన డేటాలో తెలిసింది. ఐఐటి కాన్పూర్‌ విద్యార్ధి ధీరజ్‌ సింగ్‌ ఈ గ్రూపును నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఈ ఏడాది రెండు వేల మంది గ్రాడ్యుయేట్లు కాగా, వారిలో 712 మంది విద్యార్ధులు 2024 సంవత్సరానికి ప్లేస్‌మెంట్‌ సెల్‌కు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. డిసెంబరులో ఈ ప్లేస్‌మెంట్‌ సీజను ప్రారంభమవుతుంది. ఇది మేలో ముగుస్తుంది.
ఈ గ్రూపు అందించిన డేటా ప్రకారం, 2023లో 2209 మంది రిజిస్టర్డ్‌ విద్యార్ధులు వుండగా 1485 మందికి ప్లేస్‌మెంట్‌ వచ్చింది. అంటే 32.8 శాతం మంది గత సీజనులో ఎలాంటి ప్లేస్‌మెంట్‌ లేకుండా వుండిపోయారు. ఇంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో చదివి కూడా కేంపస్‌ రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగాలు తక్కువ మందికే రావడం పట్ల ఆ గ్రూపు ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కంపెనీలను కేంపస్‌కు ఆహ్వానించడానికి పెద్ద పోరాటాలు చేయాల్సి వస్తోందని ఐఐటి-బాంబే ప్లేస్‌మెంట్‌ సెల్‌ అధికారి ఒకరు హిందూస్తాన్‌ టైమ్స్‌కు తెలిపారు. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొనడమే ఇందుకు కారణమన్నారు. ఒకవేళ కేంపస్‌కు వచ్చినా సంస్థ ముందుగా నిర్ణయించిన వేతన ప్యాకేజీలను ఆమోదించడానికి చాలా కంపెనీలు ఇష్టపడడం లేదన్నారు. అనేక దఫాలుగా చర్చలు జరిపితేనే గానీ ఒక అంగీకారానికి రావడం కూడా కష్టమవుతోందన్నారు.
సాధారణంగా అంతర్జాతీయ కంపెనీలు ఎక్కువగా ఐఐటిలకు వెళుతుంటాయి. ఈసారి ఐఐటి బాంబేకు కూడా దేశీయ కంపెనీలు మాత్రమే వెళ్ళాయి. ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్‌ల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈఏడాది ఫిబ్రవరి 28వరకు ఐఐటి ఢిల్లీలో ప్లేస్‌మెంట్‌ అయిన విద్యార్ధుల సంఖ్య 1036గా వుందని ఆర్‌టిఐ సమాధానం ద్వారా వెల్లడైంది. కేంపస్‌ రిక్రూట్‌మెంట్‌కు ఎంతమంది నమోదు చేసుకున్నారనే వివరాలు వెల్లడించలేదు.ఐఐటి కాన్పూర్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 2024లో 69శాతం మందికి ప్లేస్‌మెంట్‌ రావచ్చని అంచనా వేశారు. 2023, 2022 సంవత్సరాల్లో వరుసగా 91, 90శాతంగా ఈ ప్లేస్‌మెంట్‌లు వున్నాయి. కార్మిక విభాగ ఆర్థికవేత్త సంతోష్‌ మెహ్రౌత్రా టెలిగ్రాఫ్‌తో మాట్లాడుతూ ఐఐటిల్లో కేంపస్‌ రిక్రూట్‌మెంట్‌లు మందగించడానికి కారణాలు వక్రీకరించబడిన అభివృద్ధి, చిన్న కంపెనీలను పణంగా పెట్టి పెద్ద కంపెనీలు అభివృద్ధి చెందడమని పేర్కొన్నారు.
గత పదేళ్ళలో దేశంలో విద్యావంతుల్లో నిరుద్యోగిత రేటు బాగా పడిపోయిందని చెప్పారు. అయితే గ్రాడ్యుయేట్ల విషయానికి వస్తే, గత దశాబ్ద కాలంలో నిరుద్యోగరేటు 19.2 శాతం నుండి 35.8 శాతానికి పెరిగిందన్నారు. పోస్టు గ్రాడ్యుయేట్ల విషయంలో కూడా ఇది 21.3 శాతం నుండి 36.2 శాతానికి పెరిగిందన్నారు.
భారత్‌పై ఇటీవల అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అందచేసిన నివేదిక ప్రకారం, దేశంలో దాదాపు 82 శాతం మంది అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. దాదాపు 90 శాతం మంది చిన్నా చితకా ఉద్యోగాలే చేస్తున్నారు. సంఘటిత రంగంలో కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అనియత రంగంలోనే వున్నారని 2019, 2022 మధ్య ఈ ధోరణి బాగా పెరిగిందని ఐఎల్‌ఓ పేర్కొంది.

➡️