అదనపు డోస్‌ అవసరం లేదు : డా.ఎస్‌.కె. అరోరా

Dec 25,2023 08:46 #COVID-19, #Hospitalisation

న్యూఢిల్లీ :   భారత్‌లో కొవిడ్‌ కొత్త సబ్‌వేరియంట్‌ జెఎన్‌.1 కేసులు వేగంగ వ్యాప్తి చెందుతున్నాయి. ఈ సబ్‌వేరియంట్‌ను నిరోధించేందుకు అదనపు మోతాదు వ్యాక్సిన్‌ అవసరంలేదని సార్స్‌-కోవ్‌-2 జెనోమిక్స్‌ కన్సార్టియం చీఫ్‌ డాక్టర్‌ ఎస్‌.కె. అరోరా తెలిపారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితుల గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే, ఈ ఉపరకం వ్యాపించకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గతంలో వెలుగు చూసిన ఉపరకానికి, దీనికి మధ్య వ్యాధి లక్షణాల్లో పెద్దగా వ్యత్యాసం లేదన్నారు.

60 ఏళ్లు పైబడిన వయస్సు కలిగిన వారు, క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నవారు, ఒకటి కంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్నవారు ఈ ఉపరకంతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మేలని, అయితే అదనపు డోస్‌ వ్యాక్సిన్‌ అవసరం లేదని అన్నారు. ఇప్పటి వరకు ఒమిక్రాన్‌లో 400కు పైగా ఉపరకాలను గుర్తించామని, ఇవి మార్పు చెందుతూనే ఉన్నాయని అన్నారు. ఒమిక్రాన్‌ సబ్‌వేరియంట్‌లు తీవ్రత అధికంగా లేదని అన్నారు. ఓమిక్రాన్‌ రకం వల్ల కలిగే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు మంటతోపాటు వాంతులు, తీవ్రమైన ఒంటి నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయని, రెండు లేదా ఐదు రోజుల్లో కోలుకోవచ్చని అన్నారు. వీటిలో ఎక్కువగా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని, మరణాలు పెరగలేదని చెప్పారు. అప్రమత్తంగా ఉంటే దీని వ్యాప్తిని తేలిగ్గా అడ్డుకోవచ్చని అరోరా స్పష్టం చేశారు.

భారత్‌లో అక్టోబర్‌ చివరి వారం నుండి ఇప్పటివరకు 8 వారాలలో 22 కేసులు నమోదయ్యాయని, ఇది వేగంగా వ్యాప్తి చెందుతునడానికి ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. ఐసోలేట్‌లలో ఉన్నవారి సంఖ్య 1 శాతం కంటే తక్కువగా ఉందని చెప్పారు. ఇటీవల కేసుల సంఖ్య కొంతమేర పెరిగిందని, పరీక్షలు కూడా పెరిగాయని అన్నారు.

➡️