పార్లమెంటరీ సంస్థలు నిర్వీర్యం

Dec 26,2023 10:47 #Modi Sarkar, #Parliament
  • మోడీ పాలనలో దిగజారిన ప్రజావ్యవస్థ
  • రాష్ట్రాలే నయమంటున్న పరిశీలకులు

న్యూఢిల్లీ   :   గత వారం పార్లమెంట్‌ నుంచి ప్రతిపక్ష సభ్యులను బయటికి గెంటేసిన తర్వాత కొన్ని కీలక బిల్లులకు ప్రతిపాదించిన సవరణలను ప్రభుత్వం ఆమోదింపజేసుకుంది. వీటిలో ఐపిసి, ఇండియన్‌ ఎవిడెన్స్‌ చట్టం, సిఆర్‌పిసి, ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ చట్టం, ఇండియన్‌ వైరెలెస్‌ టెలిగ్రఫీ చట్టం ఉన్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామకంలో ప్రభుత్వానికి అపరిమిత అధికారాలు కట్టబెట్టే కొత్త బిల్లును కూడా పార్లమెంట్‌ ఆమోదించింది. దేశంలో క్రిమినల్‌ చట్టాల నిర్మాణం, ఇంటర్నెట్‌ సేవలపై నియంత్రణ, ఎన్నికల నిర్వహణ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. ఏ ప్రజాస్వామ్య దేశంలో అయినా కీలక అంశాలపై విధానపరమైన మార్పులు చేసే ముందు ప్రజాభిప్రాయాన్ని స్వీకరిస్తారు. దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుపుతారు. ఇవేమీ చేయకపోగా కనీసం చట్టసభలో నిస్పాక్షికంగా ఓటింగ్‌ కూడా జరపలేదు. పైగా ప్రతిపక్ష సభ్యులు సభలో లేకుండా చేసి మరీ కేంద్రం బిల్లులను ఆమోదించుకోవడాన్ని చూస్తుంటే ఫీల్డర్లను క్రికెట్‌ మైదానం నుండి బయటికి పోవాలని ఆదేశించి, ఆ తర్వాత బ్యాటర్‌ సెంచరీ చేసినట్లు ఉంది.

దేశంలో ప్రజాస్వామ్యం కూనారిల్లిపోతోందని చెప్పడానికి పార్లమెంటులో ప్రతిపక్షం లేకుండా చేయడానికి చేసిన ప్రయత్నమే ఉదాహరణ. గడచిన దశాబ్ద కాలంలో పేలవమైన పనితీరును కనబరుస్తూ, ప్రజల్లో అప్రదిష్ట మూటకట్టుకుంటున్న కేంద్ర సంస్థల్లో ఇప్పుడు పార్లమెంట్‌ కూడా చేరింది. ఇప్పటికే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పనితీరుపై పలు ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. రాజకీయ నాయకులు దుందుడుకుగా, అతిగా ప్రవర్తిస్తే వారికి కళ్లెం వేయడానికి సుప్రీంకోర్టుకు అధికారం ఉంది. అయితే నరేంద్ర మోడీ హయాంలో ఆ పని జరగడం లేదు. పెద్ద నోట్ల రద్దు, కాశ్మీర్‌ హోదాను కేంద్ర పాలిత ప్రాంతానికి కుదించడం, ఎన్నికల బాండ్లు, పౌరసత్వ సవరణ చట్టం… ఇలాంటి వివాదాస్పద విధానాలన్నింటికీ సుప్రీంకోర్టు రబ్బరు స్టాంపు వేయడమో లేదా దాటవేయడమో జరిగింది తప్ప వాటిని తోసిపుచ్చింది లేదు.

ఎన్నికల కమిషన్‌ నిర్వహణ విషయంలో కూడా ఇలాంటి స్వతంత్రతే కొరవడింది. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులు, నిపుణులు వ్యక్తం చేసిన ఆందోళనలు అరణ్యరోదనే అయ్యాయి. ఇప్పుడు తీసుకొచ్చిన నూతన చట్టం ఎన్నికల కమిషనర్ల నియామకంలో కేంద్రానికే అధికారాలు దఖలు పరిచింది. ఇదెలా ఉందంటే తనకు ఇష్టం వచ్చిన వారిని క్రికెట్‌ అంపైర్లుగా బ్యాటర్‌ నియమించినట్లుంది. న్యాయస్థానాలు పట్టించుకోకపోవడం, ఇడి, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు పాలకుల రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడం దేనికి సంకేతం? అధికార పక్ష నేతలు ఎన్ని తప్పులు చేసినా కిమ్మనని దర్యాప్తు సంస్థలు రాజకీయ ప్రత్యర్థులపై మాత్రం ఒంటికాలుపై లేస్తున్నాయి. ఇదంతా బహిరంగంగా జరుగుతున్న తంతే. మోడీ పాలనలో ప్రజాస్వామ్యం పరిస్థితి నానాటికి తీసికట్టు…నాగం భట్టు మాదిరిగా తయారైంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు పాలకుల జేబు సంస్థలుగా మారిపోయాయి.

  • పెరిగిన రాష్ట్రాల ప్రాధాన్యత

అనేక రాష్ట్రాలలో కూడా ప్రభుత్వ సంస్థల పనితీరు ఇలాగే ఉన్నప్పటికీ ఇంతలా దిగజారలేదు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో కేంద్ర సంస్థలే బలంగా ఉన్నాయి. అయితే రాష్ట్రాలలోనే తొలుత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రారంభమయ్యాయి. బ్రిటీష్‌ వారు 1937లో ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీలు రాజ్యాంగ అసెంబ్లీని ఎన్నుకున్నాయి. స్వాతంత్య్రానంతరం జవహర్‌లాల్‌ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్‌ అధిష్టానం రాష్ట్రాలపై పెత్తనం చెలాయించింది. 1980వ దశకం చివరలో కాంగ్రెస్‌ ప్రాభవం తగ్గిపోవడం మొదలైంది. దీంతో దేశంలో సమాఖ్యతత్వం, రాష్ట్ర రాజకీయాలు బలపడ్డాయి. ఆర్థిక రంగంలో కూడా రాష్ట్రాల ప్రాధాన్యత పెరిగింది. కేంద్ర వ్యయంతో పోలిస్తే రాష్ట్రాలు పెట్టే ఖర్చే ఆర్థిక ప్రభావం చూపింది. 1990వ దశకం నుంచి కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వాలకే ప్రజలు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభమైంది. ముస్లింలు, దళితులు, పేదలు రాష్ట్ర ప్రభుత్వాలనే ఎక్కువగా విశ్వసించారు.

జాతీయ స్థాయి ఎన్నికలతో పోలిస్తే రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నికల పైనే ప్రజలకు ఆసక్తి అధికంగా ఉంటోంది. దీనికి ఉదాహరణ లోక్‌సభ ఎన్నికల కంటే శాసనసభ ఎన్నికలలోనే ఓటింగ్‌ శాతం ఎక్కువగా ఉండడమే. అర్థ శతాబ్దం క్రితం పార్లమెంటే అత్యుత్తమమైన చట్టసభగా పేరు గాంచింది. కానీ ఈ రోజు పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంది. పార్లమెంట్‌లో కంటే రాష్ట్ర శాసనసభలలోనే కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయని ప్రజలు భావిస్తున్నారు. పరిశీలకులూ అదే చెబుతున్నారు. ఇటీవల ముగిసిన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలలో మూకుమ్మడిగా ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేశారు. రాష్ట్ర శాసనసభలలో ఇలాంటి వాతావరణం ఎన్నడూ కన్పించలేదు.

➡️