31న విచారణకు హాజరవుతా : ప్రజ్వల్‌ రేవణ్ణ

May 27,2024 18:34 #Karnataka, #Prajwal Revanna

బెంగళూరు : అనేకమంది మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జెడిఎస్‌ ఎంపి ప్రజ్వల్‌ రేవణ్ణ ఈ నెల 31న సిట్‌ ముందు విచారణకు హాజరువుతానని సోమవారం ప్రకటించారు. దేశం నుంచి పారిపోయిన నెల రోజుల తరువాత ప్రజ్వల్‌ నుంచి తొలిసారిగా ఈ ప్రకటన వచ్చింది. కన్నడ టివి ఛానెల్‌ అసియానెట్‌ సువర్ణ న్యూస్‌లో ప్రసారమైన ఒక వీడియా సందేశం ద్వారా ప్రజ్వల్‌ రేవణ్ణ ఈ విషయాన్ని పేర్కొన్నారు. ‘మే 31, శుక్రవారం ఉదయం 10 గంటలకు సిట్‌ ముందు విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతాను. విచారణకు సహకరిస్తాను. నాపై అభియోగాలపై స్పందిస్తాను. నాకు కోర్టులపై పూర్తి విశ్వాసం ఉంది. ఈ తప్పుడు కేసుల నుంచి కోర్టుల ద్వారా బయటికి వస్తానని నమ్ముతున్నాను’ అని ప్రజ్వల్‌ ఈ వీడియో సందేశంలో తెలిపారు. ‘దేవుడు, ప్రజలు, కుటుంబ సభ్యుల ఆశీర్వాదం నాపై ఉండనివ్వండి. ఈ నెల 31న విచారణకు తప్పకుండా వస్తాను. తరువాత వీటిన్నింటికీ ముగింపు పలికేందుకు ప్రయత్నిస్తాను. నాపై నమ్మకం ఉంచండి’ అని కూడా అన్నారు. తల్లిదండ్రులు, తాత దేవగౌడ, చిన్నాన్న కుమారస్వామి, రాష్ట్ర ప్రజలు, పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పారు. ‘నేను ఎక్కడ ఉన్నానో వెల్లడించలేదు. కాబట్టి, సమాచారాన్ని పంచుకోవడానికి ఇలా మీ ముందుకు వచ్చాను’ అని అన్నారు. లైంగిక వేధింపుల వీడియోలు బయటకు రావడంతో, హసన్‌ ఎన్నికలు జరిగిన ఒక రోజు తరువాత అంటే ఏప్రిల్‌ 27న ప్రజ్వల్‌ రేవణ్ణ దేశం విడిచి జర్మనీకి పారిపోయారు. సిబిఐ అభ్యర్థనతో ఇంటర్‌పోల్‌ కూడా ప్రజ్వల్‌ రేవణ్ణపై బ్లూ కార్నర్‌ నోటీసు జారీ చేసింది. అతని దౌత్య పాస్‌పోర్టు రద్దు చేస్తామని కేంద్ర విదేశాంగ శాఖ నోటీసులు జారీ చేసింది.

➡️