‘గల్లీ క్రికెట్‌లో పిల్లాడిలా’ బిజెపి పరిస్థితి : రాఘవ్‌ చద్దా

చండీగఢ్‌ :   చండీగఢ్  మేయర్‌ ఎన్నికలను వాయిదా వేయనున్నారన్న వార్తలపై  ఆప్‌ ఎంపి రాఘవ్‌ చద్దా గురువారం ధ్వజమెత్తారు. గల్లీ క్రికెట్‌లో బ్యాట్‌తో ఆడకుండా, ఆట ముగించే అసంతృప్త పిల్లవాడిలా బిజెపి పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. బిజెపి గెలిస్తేనే ఎన్నికలు నిర్వహించేలా, ఓడిపోతుందనకుంటే వాయిదా పడేలా మన దేశ ప్రజాస్వామ్యం బలహీనంగా ఉందా అని ప్రశ్నించారు.

”బిజెపికి ప్రజాస్వామ్యం- ఫోబియా పట్టుకుంది. ప్రజాస్వామ్యం- నిష్పక్షపాత ఎన్నికల పట్ల భయపడుతోంది” అని చండీగఢ్‌ ప్రచారంలో ఉన్న చద్దా ట్వీట్‌ చేశారు. ”ఇండియా ఫోరం గెలుపుపై బిజెపి భయపడుతోంది. మొత్తం 36 ఓట్లలో 20 తమకు అనుకూలంగా రావడంతో చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో ఇండియా ఫోరం విజయం సాధించేందుకు సిద్ధంగా ఉంది. బిజెపి ఘోరంగా ఓడిపోవడం ఖాయం. దీంతో బిజెపికి నిద్రలేని రాత్రులు ఎదురయ్యాయి. ఆ పార్టీ డర్టీ ట్రిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఓవర్‌టైమ్‌ పనిచేయాల్సి వచ్చింది. మొదట ఎన్నికల కార్యదర్శి అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు ప్రిసైడింగ్‌ అధికారి వంతు వచ్చింది. ఆయన కూడా అనారోగ్యం బారినపడ్డారు. ఈ డర్టీ ట్రిక్స్‌ అన్నీ మేయర్‌ ఎన్నికను వాయిదా వేసేందుకే ” అని పేర్కొన్నారు.  ఇండియా ఫోరం పట్ల బిజెపి నిస్సందేహంగా భయపడుతోందనడానికి చండీగఢ్‌ పరిణామాలు నిదర్శమని రాఘవ్‌ చద్దా వ్యాఖ్యానించారు.

చండీగఢ్‌ మేయర్‌, సీనియర్‌ డిప్యూటీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులకు నేడు ఎన్నికలు జరగాల్సి వుంది. చండీగఢ్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో మొత్తం 35 సభ్యులుండగా, బిజెపికి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఆప్‌కి 13 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్‌కు ఏడుగురు కలిపి మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉన్నారు. శిరోమణీ అకాలీదళ్‌ పార్టీ ఒక కౌన్సిలర్‌ను గెలుచుకుంది. మేయర్‌ పదవికి ఆప్‌ పోటీ పడుతుండగా, సీనియర్‌ డిప్యూటీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులకు కాంగ్రెస్‌ పోటీ పడుతోంది.

➡️