నితీష్‌కుమార్‌ యూటర్న్‌పై స్పందించిన రాహల్‌ గాంధీ

పాట్నా :   జెడియు అధ్యక్షుడు నితీష్‌కుమార్‌ యూటర్న్‌పై మొదటిసారి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. బీహార్‌లో సామాజిక న్యాయం కోసం మహాఘట్బంధన్‌ పోరాడుతుందని, కూటమికి నితీష్‌కుమార్‌ అవసరంలేదని అన్నారు. రాహుల్‌గాంధీ భారత్‌జోడో న్యాయ్  యాత్ర మంగళవారం బీహార్‌లోని పుర్నియా జిల్లాకు చేరుకుంది.  అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. సామాజిక న్యాయం కోసం మహాఘట్బంధన్‌ పోరాడుతూనే ఉంటుందని, దానికి నితీష్‌కుమార్‌ అవసరంలేదని, ఎప్పటికీ తమకు ఆయన అవసరం రాదని  అన్నారు.

దేశంలోని అన్ని రంగాల్లో దళితులు, వెనుకబడిన తరగతులకు సరైన ప్రాతినిథ్యం లభించడంలేదని అన్నారు. ఒబిసి, దళితులు, ఇతర వర్గాల ఖచ్చితమైన వివరాల కోసం దేశంలో కులగణన చేపట్టాల్సి వుందని స్పష్టం చేశారు. ఇప్పటికీ అంతర్యుద్ధ పరిస్థితులతో మణిపూర్‌ నలిగిపోతుందని అన్నారు. ప్రధాని మోడీకి ఆ రాష్ట్రాన్ని సందర్శించేందుకు సమయమే దొరకలేదని విమర్శించారు.

మహాఘట్బంధన్‌, ఇండియా ఫోరానికి ముగింపు పలికిన నితీష్‌కుమార్‌, బిజెపితో చేతులు కలిపి ఆదివారం మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

➡️