రాకాసి ‘వాయు కాలుష్యం’

Jun 21,2024 03:19 #air pollution, #Delhi
  • ప్రపంచవ్యాప్తంగా 81 లక్షల మంది మృతి
  • భారత్‌లో 21 లక్షల మంది
  • స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎయిర్‌ రిపోర్ట్‌

న్యూఢిల్లీ : గాలి కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను కలవర పెడుతున్నది. ఈ ప్రాణాంతక కాలుష్యం నానాటికీ పెరుగుతూ ప్రజల ప్రాణాలను తీస్తున్నది. వాయు కాలుష్యం 2021లో ప్రపంచవ్యాప్తంగా 81 లక్షల మంది మరణాలకు కారణమైంది. భారత్‌, చైనా వంటి దేశాల్లో దీని నష్టం ఎక్కువగా ఉన్నది. చైనాలో 23 లక్షల మంది, భారత్‌లో 21 లక్షల మంది గాలి కాలుష్యం కారణంగా ప్రాణాలు వదిలారు. ఇటీవల విడుదల చేసిన స్టేట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఎయిర్‌ రిపోర్ట్‌ ఈ విషయాన్ని వెల్లడించింది.
వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ప్రాణాంతకమైనవాటిలో ఒకటిగా ఉన్నట్లు తెలిపింది. అధిక రక్తపోటు అనేది తర్వాతి స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. వాయు కాలుష్యం ప్రజారోగ్యానికి సవాలుగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి అస్పష్టంగా ఉన్నప్పటికీ, వాయు కాలుష్య అత్యధిక భారాన్ని భరించే దేశాలలో భారత్‌ ఒకటి అని తెలిపింది. ఒక్క భారత్‌లోనే వాయు కాలుష్యం కారణంగా 21 లక్షల మంది మరణించినట్లు పేర్కొంది. భారత్‌, చైనాల నుంచి గాలి కాలుష్య మరణాల వాటా ప్రపంచవ్యాప్తంగా 55 శాతంగా ఉన్నదని తెలిపింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా 489,000 మరణాలు ఓజోన్‌ ఎక్స్పోజర్‌ కారణంగా సంభవించినట్లు తెలిపింది. వీటిలో దాదాపు 50 శాతం (237,000 మరణాలు) భారత్‌లోనే జరిగాయని పేర్కొంది. 2021లో కనీసం 169,400 మరణాలు వాయు కాలుష్యం కారణంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో అత్యధిక కాలుష్య-సంబంధిత మరణాలు సంభవించాయి.

➡️