అసత్య ప్రచారాన్ని ఆపండి !

  • కనీస మద్దతు ధర విషయంలో మోసపూరిత ప్రకటనలు వద్దు
  • రైతులకు ద్రోహం చేయొద్దు
  • బిజెపి ప్రభుత్వ చర్యలను ఎండగట్టాలని ఎఐకెఎస్‌ పిలుపు

న్యూఢిల్లీ : ఖరీఫ్‌ పంటలకు కనీస మద్దతు ధరల (ఎంఎస్‌పి) విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మరోసారి అబద్ధాలు చెబుతూ, రైతులను మోసం చేస్తోందని అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) విమర్శించింది. ఉత్పత్తి వ్యయానికన్నా 50శాతం ఎక్కువగా కనీస మద్దతు ధరను ఇస్తున్నామని చెప్పుకుంటోంది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి చాలా మోసపూరితమైన చతురతతో మాట్లాడుతూ, ఉత్పత్తి వ్యయాని కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఖరీఫ్‌ పంటలకు ఎంఎస్‌పిని ఆమోదించినట్లు ప్రకటించారు. కార్పొరేట్‌ మీడియా వెంటనే ఈ విషయాన్ని పట్టేసుకుంది. దీనిపై విమర్శనాత్మకమైన విశ్లేషణలు ఏమీ లేకుండానే ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారాన్ని చేపట్టింది. ఈ ప్రచారాలన్నీ కూడా వాస్తవానికి సుదూరంగా వున్నాయనేది సుస్పష్టం. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సు మేరకు సిటు ప్లస్‌ 50శాతం ఎంఎస్‌పి ఇస్తామని 2014లో ఇచ్చిన హామీని దారుణంగా ఉల్లంఘించింది. దీనికన్నా చాలా తక్కువగా వుండే ఎటు ప్లస్‌ ఎఫ్‌ఎల్‌ ప్లస్‌ 50శాతం ఫార్ములాకు మారిపోయింది.
వ్యవసాయ ఉపకరణాల వ్యయం, ధరలపై కమిషన్‌ (సిఎసిపి) వ్యయ అంచనాల ప్రకారం చూసినా కూడా ఎంఎస్‌పికి సిటు ప్లస్‌ 50శాతానిక ఎక్కడా పొంతన లేకుండా వుంది. 14 ఖరీఫ్‌ పంటలకు ప్రకటించిన మద్దతు ధరలను చూస్తే ఈ విషయం స్పష్టమై పోతోంది. వరి, పత్తి, జొన్న వంటి పంటలకు సంబందించి రాష్ట్రాలు ఇచ్చిన సిటు అంచనాలను పరిగణనలోకి తీసుకున్నా కూడా ఈ వ్యయ లెక్కింపుల్లో తేడాలు బాగా తెలుస్తున్నాయి. పెరిగిన ఎరువుల ధరలు, నీటిపారుదల వ్యయం వంటి వాటిని కేంద్రం అస్సలు పరిగణనలోకి తీసుకోలేదని దీన్ని బట్టి తెలుస్తోంది. కనీసం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన అంచనాలకు కూడా గౌరవం ఇవ్వలేదు.
కనీస మద్దతు ధరపై తప్పుడు మాటలు చెప్పడానికి బదులుగా రైల్వే మంత్రిగా కూడా వున్న అశ్విని వైష్ణవ్‌ రైలు ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టాలని ఎఐకెఎస్‌ సూచించింది. సమాచార, ప్రసార శాఖ మంత్రిగా ఆయన ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారంచేయకూడదని పేర్కొంది.
నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణమే ఈ ప్రకటనను నిలుపుచేసి, సంయుక్త కిసాన్‌ మోర్చాతో చర్చలు జరిపిన తర్వాత సిటు ప్లస్‌ 50శాతం హామీకి అనుగుణంగా సవరించిన ఎంఎస్‌పితో ముందుకు రావాలని ఎఐకెఎస్‌ డిమాండ్‌ చేసింది. ప్రధాని మోడీ, బిజెపి ప్రభుత్వం ఇలా ద్వంద్వ ప్రమాణాలతో చేస్తున్న ప్రకటనలను ఎండగట్టాలని, రైతు వ్యతిరేక ప్రభుత్వ చర్యలకు నిరసనగా తమ గళాలను వినిపించాలని అన్ని శాఖలకు పిలుపునిచ్చింది.

➡️