3 వారాల్లోగా చెప్పండి

  • సిఎఎపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం 
  • విచారణ ఏప్రిల్‌ 9కి వాయిదా

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పౌరసత్వ (సవరణ) నిబంధనలపై స్టే కోరుతూ దాఖలైన పిటిషన్లపై మూడువారాల్లోగా స్పందించాలని సుప్రీం కోర్టు మంగళవారం కేంద్రాన్ని ఆదేశించింది. పౌరసత్వ (సవరణ) చట్టం-2019 రాజ్యాంగపరమైన చెల్లుబాటును సవాల్‌ చేస్తూ, ఈ పిటిషన్లపై విచారణ పూర్తయ్యేవరకు స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను మంగళవారం నాడు తిరిగి విచారణకు చేపట్టిన చీఫ్‌ జస్టిస్‌ డి వై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. జస్టిస్‌ జెబి పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా నాలుగు వారాల గడువు కావాలని కోరారు. ఆయన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. మూడు వారాల్లోగా పిటీషన్లకు వివరణ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. సిఎఎ చెల్లుబాటును సవాల్‌ చేయడంతోబాటు, దీని అమలుకు ఈ నెల 11న జారీ చేసిన నిబంధనలపై స్టే కోరుతూ కేరళ ప్రభుత్వం, డివైఎఫ్‌ఐ, ఐయుఎంఎల్‌, ఇతర సంఘాలు, వ్యక్తుల నుంచి మొత్తం 236 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఏప్రిల్‌ 2లోగా ఐదు పేజీలకు మించకుండా సమాధానాన్ని ఏప్రిల్‌ 8లోగా దాఖలు చేయాలని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణనను ఏప్రిల్‌ 9కి వాయిదా వేసింది.
సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా నాలుగు వారాల గడువు కోరడంపై కొద్దిసేపు వాడిగా వేడిగా వాద ప్రతివాదాలు జరాగాయి. నాలుగువారాల గడువు చాలా ఎక్కువ అని పిటిషనర్ల తరపు న్యాయవాది కపిల్‌ సిబాల్‌ అభ్యంతరం లేవనెత్తారు. చట్టం తెచ్చిన నాలుగేళ్ల తరువాత అకస్మాత్తుగా ఇప్పుడే ఈ నిబంధనలు నోటిఫై చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం పౌరసత్వం మంజూరు చేసిన తరువాత మీరు దానిని వెనక్కి తీసుకోలేరు అని సిబల్‌ అన్నారు.. ”వారు చట్టబద్ధమైన నిబంధనలపై స్టే కోరుతున్నారు” అని సొలిసిటర్‌ జనరల్‌ ఆక్షేపించారు.. మేము నోటిఫై చేయడం లేదని గతంలో చెప్పిన కేంద్రం ఎన్నికల ముంగిట దీనిని ముందుకు తేవడంలో ఉద్దేశమేమిటో అర్థమవుతుందన్నారు.
పెండింగ్‌లో ఉన్నందున పౌరసత్వాన్ని మంజూరు చేయొద్దు
పిటిషనర్ల తరపున మరో సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ తన వాదనలు వినిపిస్తూ ఈ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున నిబంధనల ప్రకారం ఎటువంటి పౌరసత్వాన్ని మంజూరు చేయకూడదని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.. ”పౌరసత్వం మంజూరు చేయబడిందా? లేదా? అనేది పిటిషనర్లపై ప్రభావం చూపదు” అని సొలిసిటర్‌ జనరల్‌ బదులిచ్చారు. ” అది కాదు ముఖ్యం, సిఎఎ రాజ్యాంగ చెల్లుబాటు ఏమిటన్నదే ప్రధానం’ అని జైసింగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.
1995 నాటి పౌరసత్వ చట్టంలోని సెక్షన్‌ 2ని కేంద్రం సవరిస్తూ ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌లో ఉన్న హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్‌, పార్శీ, క్రైస్తవులకు మాత్రమే పౌరసత్వాన్ని ఇస్తామని చెప్పింది. మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వడమంటే కొందరి పట్ల వివక్ష చూపడమేనని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు.

➡️