నూతన విద్యా విధానం రద్దు చేయాలి

  • ముస్లింలపై దాడులను తిప్పికొట్టాలి
  • సిపిఎం కేంద్రకమిటీ పిలుపు

న్యూఢిల్లీ : విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేసేలా ఇటీవల ఎన్‌టిఎ నిర్వహించిన నీట్‌ పరీక్ష అతి పెద్ద కుంభకోణమని సిపిఎం పేర్కొంది. ఎన్‌టిఎను తక్షణమే రద్దు చేయాలని కోరింది. విద్యను కేంద్రీకృతం చేస్తూ తీసుకువచ్చిన కొత్త విద్యా విధానం పట్ల తీవ్ర విముఖత వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షించింది. దేశవ్యాప్తంగా మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఖండించింది. ఇందుకు సంబంధించి కేంద్ర కమిటీ ఈ క్రింది ప్రకటన విడుదల చేసింది.

18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సమీక్ష
ఇటీవల జరిగిన 18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కేంద్ర కమిటీ కూలంకషంగా చర్చించింది. ఈ ఫలితాలు బిజెపిని తీవ్రంగా దెబ్బతీశాయని అభిప్రాయపడింది. జీవనోపాధి పరిస్థితులు దారుణంగా క్షీణించడం పట్ల తీవ్రంగా ఆందోళనలు వ్యక్తం చేస్తూ, అలాగే రాజ్యాంగాన్ని, దేశ లౌకిక ప్రజాస్వామ్య స్వభావాన్ని పరిరక్షించేందుకు గానూ ప్రజలు గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగా ఈసారి బిజెపికి మెజారిటీ ఇవ్వలేదు. 400కి పైగా సీట్లు ఇవ్వాలని పదే పదే బిజెపి నేతలు చేసిన ప్రకటనలను తిరస్కరిస్తూ, కేవలం 240సీట్లతో సరిపెట్టారు. 2019 లోక్‌సభలో కన్నా ఇవి 63సీట్లు తక్కువ.. మొత్తమ్మీద బిజెపి 92 సిట్టింగ్‌ సీట్లు కోల్పోయింది. కానీ 29కొత్త సీట్లను గెలిచింది. అంటే నష్టపోయింది 63సీట్లు. దీంతో మెజారిటీ కన్నా 32సీట్లు తక్కువ వచ్చాయి. అయితే, మిత్రపక్షాలు అదనంగా 52సీట్లను గెలవడంతో 292మంది ఎంపీల మద్దతుతో నరేంద్ర మోడీ ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అవసరమైన మెజారిటీ కన్నా కేవలం 20సీట్లే ఎక్కువ.
ఇండియా బ్లాక్‌ పార్టీలన్నీ కలిసి 234సీట్లు సాధించాయి.. మెజారిటీ కన్నా 38సీట్లు తక్కువ. ఎన్‌డిఎ కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు 42.5శాతం ఓట్లు వచ్చాయి. ఇండియా బ్లాక్‌ పార్టీలకు మొత్తంగా 40.6శాతం ఓట్లు వచ్చాయి. ఇక్కడ రెండు కూటముల మధ్య ఓట్ల తేడా 2శాతం కన్నా తక్కువగానే అంటే 1.9శాతంగా వుంది. ఇంత ప్రతికూలంగా ఫలితాలు వచ్చినా, సంకీర్ణ ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు వచ్చినా, మోడీ నిరంకుశత్వాన్ని తిరిగి స్థాపించేందుకు బిజెపి నిరంతరం దాడులు చేస్తోంది. మొత్తంగా ఓటు వాటా ఒక శాతం కన్నా కొంచెం మేర క్షీణించిందన్న వాస్తవాన్ని దృష్టిలో వుంచుకుని గత దశాబ్ద కాలంగా కొనసాగిస్తూ వచ్చిన హిందూత్వ ప్రచారాన్ని మరింతగా ఉధృతం చేయాలని చూస్తోంది.
మతోన్మాద ధోరణులకు మరింత పదును పెట్టేందుకు గానూ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుండే ముస్లిం మైనారిటీలపై వరుసగా దాడులు మొదలెట్టింది. మరోవైపు, సిపిఎంతో సహా ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకునేందుకు కేంద్ర సంస్థలను ఆయుధాలుగా మలుచుకోవడాన్ని కొనసాగిస్తోంది. జర్నలిస్టులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు, కేజ్రివాల్‌ను తిరిగి సిబిఐ అరెస్టు చేయడం, అరుంధతి రారు ప్రాసిక్యూషన్‌కు అనుమతినివ్వడం వంటి చర్యలు అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఎ)ను, ప్రధాని ప్రధాన కార్యదర్శిని పునర్నిర్మించిన మోడీ జి7 నేతలను కలుసుకునేందుకు ఇటలీ వెళ్ళారు. ఈ సమావేశంలో భారత్‌కు ఎలాంటి ఎజెండా లేదు. ఎన్నికైన మాజీ మంత్రులందరినీ దాదాపుగా తిరిగి కేబినెట్‌లోకి తీసుకుని అవే శాఖలను కేటాయించారు. దాదాపు 150మంది ఎంపీలను సస్పెండ్‌ చేసిన ఓం బిర్లాను లోక్‌సభ స్పీకర్‌గా తిరిగి ప్రతిష్టించారు. మోడీ నేతృత్వంలో అంతా సాధారణంగానే సాగుతోందన్న భావన కల్పించడానికి తంటాలు పడుతున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో మెజారిటీ ప్రజల జీవనోపాధులు మెరుగుదల కోసం పోరాటాలు చేయడంతో పాటు భారత రాజ్యాంగం, లౌకిక ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం, పౌర స్వేచ్ఛ పరిరక్షణ కోసం పార్లమెంట్‌ లోపల, వెలుపల పోరాటాలను ఉధృతం చేయాలని కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.ఈ బృహత్తర కర్తవ్యాన్ని దేశవ్యాప్తంగా ఇతర లౌకిక ప్రజాస్వామ్య పార్టీలతో కలిసి, అలాగే స్వతంత్రంగా సిపిఎం చేపట్టనుంది.

సిపిఎం పనితీరు
మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేపట్టడంలో, ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలకు వ్యతిరేకంగా లౌకికవాద శక్తులను సమీకరించడంలో, తద్వారా ఇండియా బ్లాక్‌ను బలోపేతం చేయడానికి శ్రమజీవులను సమీకరించడంలో సిపిఎం కీలక పాత్ర పోషించింది. అయితే, ఎన్నికల్లో పార్టీ పనితీరు నిరాశాజనకంగా వుంది. 2019లో 71 స్థానాలకు పోటీ చేస్తే ఈసారి 52 స్థానాలకు సిపిఎం పోటీ చేసింది. వీటిలో, నాలుగు సీట్లను (తమిళనాడులో రెండు, కేరళ, రాజస్థాన్‌ల్లో ఒక్కోటి) గెలుపొందింది. మొత్తంగా వామపక్షాలు 8సీట్లను గెలుచుకున్నాయి. వీటిల్లో సిపిఎంకి 4, సిపిఐ కి 2, సిపిఐ(ఎంఎల్‌)కు -2 స్థానాలు లభించాయి. పోటీ చేసిన అన్ని రాష్ట్రాల్లో పార్టీ పనితీరును కేంద్ర కమిటీ కూలంకషంగా సమీక్షించింది. తీవ్రమైన స్థాయిలో ఆత్మ పరిశీలన చేపట్టింది. బలహీనతలు, లొసుగులు, లోపాలను గుర్తించింది. ఈ లోపాలను అధిగమించి, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రూపొందించిన చర్యలు, కర్తవ్యాల అమలును పార్టీ రాష్ట్ర కమిటీలు ముందుకు తీసుకెళ్తాయి.

మైనారిటీలపై దాడులు
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఎదురుదెబ్బలు తిన్న నేపథ్యంలో దేశంలో పలు ప్రాంతాల్లో ముస్లింలపై వారి జీవనోపాధులపై, ఆస్తులపై విచ్చలవిడిగా జరుగుతున్న దారుణమైన దాడులను తీవ్రంగా ఖండించింది.
చత్తీస్‌గఢ్‌లోని రారుపూర్‌, యుపిలోని అలీగఢ్‌, గుజరాత్‌లోని చికొద్రాల్లో ముస్లింలపై జరిగిన దాడుల్లో మొత్తంగా ఐదుగురు మరణించారు. గో వధ జరిగిందని, లేదా గొడ్డు మాంసాన్ని స్వాధీనం చేసుకున్నామనే నిరాధార ఆరోపణలతో మధ్యప్రదేశ్‌లోని మాండ్లాలో 11మంది ముస్లింల ఇళ్ళను ధ్వంసం చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని నహన్‌లో ముస్లింకు చెందిన ఒక దుకాణాన్ని ధ్వంసం చేశారు. అనేకమంది దుకాణాలను బలవంతంగా మూసివేయించారు. ఒరిస్సాలోని బాలాసోర్‌లో ఘర్షణ చోటు చేసుకుంది.
గుజరాత్‌లోని వడోదరలో అల్పాదాయ వర్గాల గృహ నిర్మాణ సముదాయంలో తనకు కేటాయించిన ఫ్లాట్‌ను తీసుకోనివ్వకుండా ముస్లిం మహిళను అడ్డుకున్నారు. ఢిల్లీలోని సంగమ్‌ విహారాలో గో కళేబరం దొరికిందంటూ హిందూత్వ సంస్థల కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంతో అక్కడవారు పారిపోయారు. జబల్‌పూర్‌లో ముస్లింలను నగరం వదిలి పారిపోవాలని బెదిరిస్తూ హిందూత్వ సంస్థలు ఒక ప్రదర్శన నిర్వహించాయి.
ఎన్నికల్లో బిజెపి మెజారిటీని సాధించలేని పరిస్థితుల్లో మతోన్మాద దాడులు, ధోరణులు ఇలా పెచ్చరిల్లి పోవడమంటే మరింత ప్రతీకారేచ్ఛతో హిందూత్వ మతోన్మాద శక్తులు రగిలిపోతూ దాడులను ఉధృతం చేస్తున్నాయన్న వాస్తవం స్పష్టమవుతోంది.
బిజెపి, ఇతర మతోన్మాద సంస్థలు పన్నుతున్న ఇటువంటి నీచమైన ఎత్తుగడలు, కుయుక్తులకు వ్యతిరేకంగా అప్రమత్తంగా వుండాల్సిందిగా పార్టీ శాఖలన్నింటికీ సిపిఎం కేంద్ర కమిటీ పిలుపిచ్చింది. ఇటువంటి విషపూరితమైన దాడులు, చర్యలకు వ్యతిరేకంగా పార్టీ శాఖలు తక్షణమే నిరసన కార్యాచరణ చేపట్టాలని కోరింది.

పరీక్షల కుంభకోణాలు విద్యా మంత్రి రాజీనామా చేయాలి
నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించిన పరీక్షల చుట్టూ కమ్ముకున్న కుంభకోణాలతో ప్రభావితమైన లక్షలాదిమంది విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, ఇతరులు ఎదుర్కొంటున్న మానసిక ఆవేదన, తగిలిన దెబ్బల పట్ల కేంద్ర కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.విద్యను కేంద్రీకరించాలని, వాణిజ్యకరించాలని, వర్గీకరించాలని పేర్కొంటున్న నూతన విద్యా విధానం 2020 పట్ల కేంద్ర కమిటీ తీవ్ర వ్యతిరేకతను పునరుద్ఘాటించింది. పరీక్షల వ్యవస్థను కేంద్రీకృతం చేయడం ఈ డ్రైవ్‌లో భాగంగా వుంది. వ్యాపం కుంభకోణంలో చేసిన మాదిరిగానే ఇందులో కూడా సిబిఐకి దర్యాప్తును అప్పగించడం కేవలం కంటితుడుపు చర్యేనని కేంద్ర కమిటీ అభిప్రాయపడింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇక పదవిలో కొనసాగే నైతిక హక్కును కోల్పోయారు. తక్షణమే ఆయన తన పదవికి రాజీనామా చేయాలి. అలాగే కేంద్రీకృత పరీక్షా వ్యవస్థను రద్దు చేయాలని కేంద్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఎన్‌టిఎను రద్దు చేసి, విద్యా వ్యవస్థను కేంద్రీకృతం చేసే దిశగా తీసుకున్న చొరవలన్నింటినీ ఉపసంహరించుకోవాలని కోరింది.

 

➡️