చట్టబద్ధమైన ‘మద్దతు’తోనే రైతుకు మనుగడ

Mar 9,2024 08:50
  • రైతు ఆత్మహత్యల నివారణకుచర్యలు చేపట్టాలి
  • బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలను ప్రతిఘటించాలి
  • మహారాష్ట్ర పత్తి, సోయాబీన్‌ రైతుల సదస్సులో డాక్టర్‌ మధుర స్వామినాథన్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో అన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ఇవ్వాలని, దీనికి చట్టబద్ధత కల్పించాలని, అప్పుడే రైతుకు మనుగడకు భరోసా కలుగుతుందని ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ కుమార్తె డాక్టర్‌ మధుర స్వామినాథన్‌ తెలిపారు. బెంగుళూరులోని భారత గణాంక సంస్థకు చెందిన ఆర్థిక విశ్లేషణ (ఎకనామిక్‌ అనాలిసిస్‌) విభాగంలో ఆమె ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) అనుబంధ మహారాష్ట్ర పత్తి, సోయాబీన్‌ రైతుల సంఘం రాష్ట్ర సదస్సులో శుక్రవారం ఆమె ప్రసంగించారు. ఎఐకెఎస్‌ మహారాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బీడ్‌ జిల్లాలోని మజల్‌గావ్‌లో ఈ సదస్సు జరిగింది. ఎఐకెఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఉమేష్‌ దేశ్‌ముఖ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు వెయ్యి మంది పైగా ప్రతినిధులు హాజరయ్యారు. మధుర స్వామినాథన్‌ ప్రారంభోపన్యాసం చేయగా ముగింపు ప్రసంగాన్ని కిసాన్‌సభ జాతీయ అధ్యక్షులు అశోక్‌ థావలే చేశారు. మధుర స్వామినాథన్‌ మాట్లాడుతూ విదర్భ, మరఠ్వాడా ప్రాంతాలలో అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు బలవన్మరణం చేసుకోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపిస్తున్న రెండు ప్రధాన పంటలు పత్తి, సోయాబీన్‌ పండించే ఈ ప్రాంతాల్లోనే రైతుల దుస్థితి ఇలావుంటే ఇక దేశంలోని ఇతర ప్రాంతాల రైతుల పరిస్థితి ఇంకెంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. కనీస మద్దతు ధర లభించకపోవడమే ఇందుకు ముఖ్యకారణమని ఆమె విశ్లేషించారు. కుల, మతాల వారీగా ప్రజలను విభజించే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలను ఎదుర్కొని, ప్రజల వాస్తవ సమస్యలు, వాటికి గల కారణాలపై దృష్టి సారించే విధంగా ప్రతిఘటనా పోరాటాన్ని నిర్మించడంపై దృష్టి సారించాలని ఆమె పిలుపునిచ్చారు. పత్తి, సోయాబీన్‌తో పాటు దేశంలో పండే అన్ని పంటలకు లాభదాయకమైన ఎంఎస్‌పి కల్పించేందుకు చట్టపరమైన భరోసా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

బిజెపిని ఓడించేందుకు రైతులు కదలాలి : అశోక్‌ ధావలే

                    ప్రజా, రైతు వ్యతిరేక కార్పొరేట్‌ అనుకూల బిజెపిని ఓడించేందుకు రైతులంతా ఏకతాటిపై నడిచి కృషి చేయాలని కిసాన్‌సభ అధ్యక్షులు అశోక్‌ ధావలే పిలుపునిచ్చారు. ఎంఎస్‌పి, రుణమాఫీ, పంటల బీమా, పెన్షన్‌ తదితర సమస్యలపై జాతీయోద్యమాన్ని నిర్మించాల్సిన అవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు. కిసాన్‌సభ, కేంద్ర కార్మిక సంఘాల వేదిక నేతృత్వంలో ఇప్పటికే దేశవ్యాప్త పోరాటానికి పిలుపునిచ్చిందని తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని, దానికి వంత పాడుతున్న పార్టీలను ఓడించాలని కోరారు. ఇందుకోసం తమతమ ప్రాంతాల్లో అన్నదాతలు ముమ్మర ప్రచారం సాగించాలని విన్నవించారు. ఈ సదస్సులో ఎఐకెఎస్‌ మాజీ అధ్యక్షులు క్రాంతిసిన్హ్‌ నానా పాటిల్‌, రాష్ట్ర మాజీ అధ్యక్షులు గంగాధర్‌ అప్పా బురాండే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ అజిత్‌ నవాలే, నాయకులు అజరు బురాండే, దత్తా దాకే తదితరులు పాల్గొన్నారు.

పత్తికి రూ.12 వేలు ఎంఎస్‌పి ఇవ్వాలి

           పత్తికి క్వింటాల్‌కు రూ.12 వేలు, సోయాబీన్‌కు రూ.8 వేలు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) కల్పించాలని సదస్సు తీర్మానం చేసింది. ఎంఎస్‌ స్వామినాథన్‌ ప్రతిపాదించిన ఫార్ములా సి2 ప్లస్‌ 50 శాతం ప్రకారం అన్ని పంటలకు ఎంఎస్‌పి కల్పించాలని సదస్సు డిమాండ్‌ చేసింది.

➡️