చట్టపరమైన ఆదేశాలు లేవు

May 24,2024 08:06 #no legal mandates, #supreemcourt

గందరగోళానికి దారితీయొచ్చు
పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటింగ్‌ శాతం వెల్లడిపై ఇసి
సుప్రీంలో 225 పేజీల అఫిడవిట్‌
న్యూఢిల్లీ : పోలింగ్‌ శాతాన్ని లేదా పోలింగ్‌ కేంద్రాల వారీగా ఎన్ని ఓట్లు పోలైనదీ వెల్లడించాలని చట్టపరమైన ఆదేశాలేవీ లేవని ఎన్నికల కమిషన్‌ తెలిపింది. ఈ వివరాలు వెల్లడించడం వల్ల గందరగోళానికి ఆస్కారం ఏర్పడుతుందని సెలవిచ్చింది. పైగా ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉన్నదని చెప్పింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన 48 గంటల్లోగా పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటింగ్‌ వివరాలను ఈసీ తన వెబ్‌సైటులో అప్‌లోడ్‌ చేయాలని, దీనిపై ఎన్నికల సంఘానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌), కామన్‌ కాజ్‌ సంస్థలు సుప్రీంకోర్టులో ఈ నెల 17న పిటిషన్‌ దాఖలు చేశాయి. దీనిపై వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు 225 పేజీల అఫిడవిట్‌ను ఇసి అందజేసింది.
పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటింగ్‌ శాతాన్ని బహిర్గతం చేస్తే ఎన్నికల యాంత్రాంగం గందరగోళానికి గురవుతుందని తన అఫిడవిట్‌లో ఇసి తెలిపింది. పోలింగ్‌ కేంద్రంలో పోలైన ఓట్ల సంఖ్యను తెలియజేసే ఫారం-17సీని స్కాన్‌ చేసి, దానిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని చట్టంలో ఎలాంటి ఆదేశాలు లేవని స్పష్టం చేసింది. మొదటి, రెండవ విడత పోలింగ్‌ ముగిసిన తర్వాత ఇసి వెల్లడించిన పోలింగ్‌ శాతం కంటే ఆ తర్వాత విడుదల చేసిన ఓటింగ్‌ శాతం 5-6% ఎక్కువగా ఉన్నదని వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది.
2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పిటిషనర్‌ లేవనెత్తిన ఆరోపణలు నిరాధారమని ఇసి తెలిపింది. పోలింగ్‌ ముగిసిన తర్వాత ఫారం-17సీని పోలింగ్‌ ఏజెంట్‌ పొందవచ్చునని చెప్పింది. దాని ఒరిజనల్‌ కాపీలు ఇప్పుడు ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌రూముల్లో ఉన్నాయని వివరించింది. ఫారం-17సీ ప్రతిని ఎవరికైనా ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించవని స్పష్టం చేసింది. పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓటింగ్‌ శాతాన్ని బహిర్గతం చేస్తే ఆ సమాచారాన్ని మార్ఫింగ్‌ చేసే ప్రమాదం ఉన్నదని తెలిపింది.
అలాగే ఇసి తన అఫిడవిట్‌లో పిటిషనర్లపై మండిపడింది. కొన్ని శక్తులు తమ స్వప్రయోజనాల కోసం నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇలాంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయని గుర్తు చేసింది. కాగా పోలింగ్‌ ముగిసిన తర్వాత ఫారం-17సీపై ప్రిసైడింగ్‌ అధికారి సంతకం చేసి ఏజెంటుకు ఇస్తారని, అలాంటప్పుడు ఆ సమాచారాన్ని ఇసి తన వెబ్‌సైటులో ఉంచితే సమస్య ఏముంటుందని ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ప్రశ్నించారు.

➡️