అణచివేత,, బెదిరింపుల భయంతో స్వదేశాలకు దూరంగా వేలాదిమంది జర్నలిస్టు

యుఎన్‌ జనరల్‌ అసెంబ్లీకి నివేదికలో ఇండిపెండెంట్‌ ఇన్వెస్టిగేటర్‌ ఇర్నె ఖాన్‌ వెల్లడి
ఐక్యరాజ్య సమితి : రాజకీయ వేధింపులు, అణచివేత చర్యలు, బెదిరింపుల నుండి తప్పించుకునేందుకు వేలాదిమంది జర్నలిస్టులు స్వదేశాల నుండి పారిపోతున్నారని ఐక్యరాజ్య సమితి నిపుణురాలు, స్వతంత్ర దర్యాప్తు అధికారి ఇర్నె ఖాన్‌ తెలిపారు. అయితే వారు ప్రవాసంలో వున్నప్పటికీ తరచుగా భౌతిక, చట్టపరమైన, డిజిటల్‌ బెదిరింపులకు గురువుతునే వున్నారని ఆమె తెలిపారు.
భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు పరిరక్షణకై పోరాడుతున్న స్వతంత్ర దర్యాప్తు అధికారి అయిన ఇర్నె ఖాన్‌ ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీకి అందచేసిన ఒక నివేదికలో ఆమె ఈ విషయాలు వెల్లడించారు. అనేకమంది జర్నలిస్టులు, కొన్ని స్వతంత్ర మీడియా సంస్థలు స్వేచ్ఛగా, నిర్భయంగా వార్తలందించడానికి, ఇన్వెస్టిగేట్‌ చేసుకోవడానికి వీలుగా వుండేలా దేశాలు విడిచి వెళ్ళాయని, ఆమె తెలిపారు. ప్రజాస్వామ్య దేశాల్లో స్వతంత్ర, విమర్శనాత్మక మీడియాకు ప్రాముఖ్యత కుంచించుకుపోతూ వస్తోందని, నిరంకుశ ధోరణులు పెరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి చోట్లే జర్నలిస్టులు ప్రవాసంలోకి వెళుతున్నారని అన్నారు. మూడో వంతు ప్రపంచ దేశాల్లో ఈనాడు స్వేచ్ఛా, స్వతంత్ర, వైవిధ్యమైన మీడియాకు మద్దతిచ్చే ప్రజాస్వామ్యం కరువవడం లేదా తీవ్రంగా ఇబ్బందులకు గురవడం జరుగుతోందన్నారు. గతంలో అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సెక్రటరీ జనరల్‌గా చేసిన ఇర్నె ఖాన్‌ బంగ్లాదేశ్‌లో లాయర్‌గా కూడా పనిచేశారు. తమ భద్రత కోసం ఒక పక్క భయపడుతూనే మరోపక్క స్వదేశంలో తమ కుటుంబం పడే ఇబ్బందులును తలచుకుంటూ పైగా విదేశాల్లో నివసించడం వల్ల ఎదురయ్యే స వాళ్ళను అధిగమించేందుకు ప్రయత్నిస్తూ అనేకమంది జర్నలిస్టులు చిట్టచివరికి తమ వృత్తిని కూడా వదులుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రవాసమనేది విమర్శకుల నోళ్లను మూసివేయించడానికి మరో మార్గమని ఆమె వ్యాఖ్యానించారు.
ఇటీవలి సంవత్సరాల్లో ఆఫ్ఘనిస్తాన్‌, బెలారస్‌, చైనా, ఇథియోపియా, ఇరాన్‌, మయన్మార్‌, నికారాగ్వా, రష్యా, సూడాన్‌, సోమాలియా, టర్కీ, ఉక్రెయిన్‌ల నుండి వందలాదిమంది జర్నలిస్టులు పారిపోయారని ఆమె చెప్పారు. బురుండి, గ్వాటెమాలా, భారత్‌, పాకిస్తాన్‌, తజకిస్తాన్‌ల నుండి కూడా చాలా కొద్దిమంది వెళ్ళిపోయారని ఆమె తెలిపారు. సరిహద్దులకు ఆవల దేశాలు పాల్పడే మానవ హక్కుల ఉల్లంఘనలపై ఎలాంటి డేటా లేదని చెప్పారు. ఇతర దేశాలకు ప్రవాసం వచ్చిన జర్నలిస్టులకు వీసాలు, వర్క్‌ పర్మిట్లు ఇవ్వాలని ఆమె ఆయా దేశాలను కోరారు.

➡️