అప్రజాస్వామికం.. రాజ్యాంగ విరుద్ధం… : జమిలి ఎన్నికలపై సిపిఎం

  • కోవింద్‌తో పార్టీబృందం భేటీ

న్యూఢిల్లీ : జమిలి ఎన్నికల ప్రతిపాదనపై సిపిఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జమిలి ఎన్నికలపై ఇప్పటికే నిర్ణయం తీసుకొన్నారని, వాటిని ఎలా నిర్వహించాలనే విషయంపై మాత్రమే రాజకీయ పార్టీల అభిప్రాయాలు కోరుతున్నారని గుర్తు చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యుడు నీలోత్పల్‌ బసు, కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు మురళీధరన్‌తో కూడిన సిపిఎం ప్రతినిధి బృందం మంగళవారం ఉన్నత స్థాయి కమిటీతో సమావేశమైంది. జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఒకే దేశం…ఒకే ఎన్నికపై ఈ కమిటీ వివిధ పార్టీల అభిప్రాయాలు సేకరిస్తోంది. అందులో భాగంగా కమిటీ ఆహ్వానం మేరకు సిపిఎం ప్రతినిధి బృందం దానితో సమావేశమైంది.

పార్టీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ సిపిఎం గత సంవత్సరం డిసెంబర్‌ ఏడవ తేదీన కమిటీకి సవివర మైన లేఖను అందజేసింది. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలు జమిలి ఎన్నికలపై తమ అభ్యంతరాలను పునరుద్ఘాటించారు. సిపిఎం ప్రతినిధి బృందం వ్యక్తం చేసిన అభిప్రాయాలను కమిటీ ఆలకించింది. కమిటీ లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు నేతలు సమాధానం ఇచ్చారు.

జమిలి ఎన్నికల అంశాన్ని పరిశీలించి, వాటి నిర్వహణ కోసం సిఫార్సులు చేయడానికి మాత్రమే ఉన్నత స్థాయి కమిటీ పరిమితమైందన్న సంగతి స్పష్టమవుతోందని డిసెంబరులో రాసిన లేఖలోనే సిపిఎం పేర్కొంది. కమిటీ ఎజెండాను, దాని లక్ష్యాన్ని ముందుగానే నిర్ణయించారని, ఫలితాన్ని కూడా ముందే నిర్ణయించారంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 2018 జూలై 4న లా కమిషన్‌కు సమర్పించిన నోట్‌లోనే పార్టీ అభిప్రాయాన్ని తెలియజేశామని, దానికే కట్టుబడి ఉన్నామని తెలిపింది. జమిలి ఎన్నికల ప్రతిపాదన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ ప్రతిపాదన అప్రజాస్వామికమని, సమాఖ్య సూత్రాలకు విరుద్ధమని తెలిపింది. జమిలి ఎన్నికల నిర్వహణ ఆచరణ సాధ్యం కాదని సిపిఎం అభిప్రాయపడింది. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య మూలాలపై జరుగుతున్న దాడిగా అభివర్ణించింది. లోక్‌సభ లేదా రాష్ట్ర శాసనసభల పదవీకాలాన్ని పొడిగించేందుకు జరిపే ఏ ప్రయత్నమైనా రాజ్యాంగ విరుద్ధమని, అప్రజాస్వామికమని సిపిఎం విమర్శించింది.

➡️