‘అనన్య’ విజయం

Apr 16,2024 23:56 #released, #UPSC Civils Results
  • పాలమూరు బిడ్డకు మూడో ర్యాంకు
  •  సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు
  •  2023 ఫలితాలు వెల్లడి
  •  ఆదిత్య శ్రీవాత్సవకు టాప్‌ ర్యాంక్‌

న్యూఢిల్లీ : సివిల్స్‌లో ఈ ఏడాది కూడా తెలుగు తేజాలు మెరిశారు. తొలి ప్రయత్నంలోనే సొంత ప్రణాళికతో పట్టుదలతో పాలమూరు బిడ్డ డొనురు అనన్య రెడ్డి టాప్‌ 10లో మూడో ర్యాంకు సాధించి సత్తా చాటారు. అలాగే నందల సాయికిరణ్‌ (27), మేరుగు కౌశిక్‌ (82) టాప్‌ 100లో చోటు దక్కించుకొని తెలుగు ఖ్యాతిని ఇనుమడింపజేశారు. వీరితో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఈ ఏడాది సివిల్స్‌లో విజయదుందుభి మోగించారు.

సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌- 2023 ఫలితాలను కేంద్ర యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యుపిఎస్‌సి) మంగళవారం ప్రకటించింది. అదిత్య శ్రీవాత్సవకు మొదటి ర్యాంక్‌, రెండో ర్యాంక్‌ను అనిమేష్‌ ప్రధాన్‌ సొంతం చేసుకోగా, మూడో ర్యాంక్‌ను మహబూబ్‌నగర్‌కు చెందిన డొనురు అనన్య రెడ్డి సాధించారు. పరీక్షలు రాసిన అభ్యర్థులు యుపిఎస్‌సి వెబ్‌సైట్లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. పరీక్షల ద్వారా మొత్తం 1,016 అభ్యర్థులను కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ సర్వీసులకు సిఫార్సు చేయడం జరుగుతుందని యుపిఎస్‌సి తెలిపింది. వీరిలో 115 మంది ఆర్థికంగా బలహీన వర్గాలు, 303 మంది ఒబిసి, 165 మంది ఎస్‌సి, 86 మంది ఎస్‌టి అభ్యర్థులు . మిగిలిన 347 మంది జనరల్‌ కేటగిరికి చెందినవారు. తొలి 25 ర్యాంకులు సాధించినవారిలో 10 మంది మహిళలు, 15 మంది పురుషులు. పీకే సిద్ధార్థ్‌ రామ్‌కుమార్‌ (4), రుహాని (5), సృష్టి దబాస్‌ (6), అన్‌మోల్‌ రాఠోర్‌ (7), ఆశీష్‌ కుమార్‌ (8), నౌషీన్‌ (9), ఐశ్వర్యం ప్రజాపతి (10) ర్యాంకుల్లో నిలిచారు.

సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు వీరే..
దోనూరు అనన్య రెడ్డి మూడో ర్యాంకుతో సత్తా చాటగా.. నందల సాయికిరణ్‌ 27, మేరుగు కౌశిక్‌ 82, పెంకీసు ధీరజ్‌రెడ్డి 173, జి.అక్షరు దీపక్‌ 196, గణేశ్న భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ 198, నిమ్మనపల్లి ప్రదీప్‌ రెడ్డి 382, బన్న వెంకటేశ్‌ 467, కడుమూరి హరిప్రసాద్‌ రాజు 475, పూల ధనుష్‌ 480, కె.శ్రీనివాసులు 526, నెల్లూరు సాయితేజ 558, కిరణ్‌ సాయింపు 568, మర్రిపాటి నాగభరత్‌ 580, పోతుపురెడ్డి భార్గవ్‌ 590, వద్యావత్‌ యశ్వంత్‌ నాయక్‌ 627, కె.అర్పిత 639, ఐశ్వర్య నెల్లిశ్యామల 649, సాక్షి కుమారి 679, చౌహాన్‌ రాజ్‌కుమార్‌ 703, గాదె శ్వేత 711, వి.ధనుంజరు కుమార్‌ 810, లక్ష్మీ బానోతు 828, ఆదా సందీప్‌ కుమార్‌ 830, జె. రాహుల్‌ 873, హనిత వేములపాటి 887, కె.శశికాంత్‌ 891, కెసారపు మీన 899, రావూరి సాయి అలేఖ్య 938, గోవద నవ్యశ్రీ 995 ర్యాంకుల్లో మెరిశారు.

ఏలూరు డిప్యూటీ కలెక్టర్‌కు 198వ ర్యాంకు
పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలి గ్రామానికి చెందిన గణేశ్న భాను శ్రీలక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష ఏలూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్నారు. సివిల్స్‌ ఫలితాల్లో 198వ ర్యాంకు సాధించారు. ఆమె గ్రూప్‌-1 పరీక్షలో తొలి ప్రయత్నంలోనే మొదటి ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. సివిల్స్‌ ఫలితాల్లో 198వ ర్యాంకు సాధించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం కొత్తవలసకు చెందిన బండి ఓంకార్‌ 202వ ర్యాంకు సాధించారు. ఆయన తండ్రి బండి వీర్రాజు (స్వామి) పార్వతీపురంలో ప్రస్తుతం మెకానిక్‌గా పనిచేస్తూ ఆటో మొబైల్‌ షాపు నిర్వర్తిస్తున్నారు. పేద కుటుంబానికి చెందిన ఓంకార్‌ సివిల్స్‌లో ర్యాంకు సాధించడం పట్ల పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కురుపాం గ్రామానికి చెందిన దొనక పృథ్వీరాజ్‌ 493వ ర్యాంకు ర్యాంకు సాధించారు. పృథ్వీరాజ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పిజి చదివారు. ఇంటి వద్దే ఉంటూ సివిల్స్‌కు సన్నద్ధమై రెండో ప్రయత్నంలో విజయం సాధించారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన బాన్న వెంకటేష్‌కు 467వ ర్యాంకు దక్కింది. విశాఖలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్‌ చదివారు. ఆ తర్వాత తమిళనాడులోని తిరుచునూర్‌లో నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కోర్సు చేశారు. చెన్నైలో రెండేళ్లపాటు ఓ బొగ్గు గని కంపెనీలో పని చేశారు. తర్వాత సివిల్స్‌పై మక్కువతో సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యారు. రెండో ప్రయత్నంలో ర్యాంకు దక్కించుకున్నారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని శ్రీ నగర్‌ కాలనీకి చెందిన రాహుల్‌ సివిల్స్‌ 873వ ర్యాంకు సాధించారు. మద్రాసులో బిటెక్‌ ఐఐటి పూర్తి చేసిన ఆయన తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌కు ఎంపికయ్యారు. ప్రకాశం జిల్లా శింగరాయకొండకు చెందిన ఉదరు రెడ్డికి 780వ ర్యాంకు సాధించారు. ఆయన తెలుగు మీడియంలో బిఎ చదువుకొని కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తూ ఈ ర్యాంకు సాధించారు.

స్వీయ ప్రణాళికతోనే : అనన్య
మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. పదో తరగతి వరకు మహబూబ్‌నగర్‌ గీతం హైస్కూల్‌లో చదివిన అనన్య.. ఇంటర్‌ విద్యను హైదరాబాద్‌లో అభ్యసించారు. ఢిల్లీలోని మెరిండా హౌస్‌ కాలేజీలో డిగ్రీ చదివిన ఆమె ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోకుండానే ఈ ఘనతను సాధించారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. ఇంటర్వ్యూ తర్వాత సివిల్స్‌కు ఎంపిక అవుతానని భావించినప్పటికీ.. మూడో ర్యాంకు వస్తుందని ఊహించలేదని ఆమె చెప్పారు. సొంత ప్రణాళికతోనే రోజుకు 12 నుంచి 14 గంటలపాటు చదివినట్లు తెలిపారు. చిన్నప్పటి నుంచే సమాజానికి సేవ చేయాలన్న కోరికతోనే సివిల్స్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి సివిల్స్‌కు…
తొలి ప్రయత్నంలోనే మరో తెలుగు అభ్యర్థి కౌశిక్‌ 82వ ర్యాంకు సాధించారు. సివిల్స్‌కు ఎంపిక కావడమే లక్ష్యంగా క్యాప్‌ జెమినీలో ఉద్యోగం వదులుకొని మెయిన్స్‌కు ప్రిపేర్‌ అయ్యారు. ఒయులో సివిల్‌ ఇంజనీరింగ్‌లో బిటెక్‌ పూర్తి చేసిన ఆయన.. ఢిల్లీలో ఎంబిఎ చేశారు. ఈ సందర్భంగా కౌశిక్‌ మాట్లాడుతూ.. రోజుకు ఎనిమిది, తొమ్మిది గంటలపాటు ప్రిపేర్‌ అయినట్లు చెప్పారు. ప్రిలిమ్స్‌ తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేసి మెయిన్స్‌ రాశానన్నారు. తనకు వందలోపు ర్యాంకు వస్తుందని ఊహించలేదని తెలిపారు. వికలాంగుల సంక్షేమం, ఆరోగ్య రంగంపై పని చేయాలని ఉందని కౌశిక్‌ తెలిపారు. వీరితో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 50 మంది సివిల్స్‌కు ఎంపికయ్యారు.

➡️