Vizhinjam Port: విజింజం పోర్టుకు కస్టమ్స్ ఆమోదం

తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విజింజం అంతర్జాతీయ నౌకాశ్రయం కస్టమ్స్ పోర్టుగా ఆమోదం పొందింది. ప్రాజెక్ట్ ట్రయల్ రన్‌కు సిద్ధమవుతున్న దీనికి సెక్షన్ 7A కింద ఆథరైజేషన్ మంజూరు చేశారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో విజింజం ఎగుమతి, దిగుమతులకు అవకాశం ఉన్న ఓడరేవుగా మారిందని మంత్రి వీఎన్ వాసవన్ అన్నారు. కార్యాలయ సౌకర్యాలు, కంప్యూటర్ వ్యవస్థ, మెరుగైన సర్వర్ రూమ్ సౌకర్యం వంటి 12 మార్గదర్శకాలను కేంద్ర కస్టమ్స్ మంత్రిత్వ శాఖ ముందుంచింది.

భారతదేశం నుండి విదేశాలకు ఎగుమతి, దిగుమతులకు  విజింజం పోర్టు ఒక ప్రధాన కేంద్రంగా మారడానికి అవకాశం కల్పిస్తుంది. సెక్షన్ 8 మరియు సెక్షన్ 45 కింద అధికారాలు, కస్టమ్స్ పరిధి మరియు ఏజెన్సీని పేర్కొనే పోర్ట్‌కోడ్ ఇప్పుడు అవసరం. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. భారతదేశంలోని స్థానిక ప్రాంతాల నుండి చిన్న ఓడలలో వచ్చే కార్గో మరియు కంటైనర్‌లను దించవచ్చు. పెద్ద మదర్‌షిప్‌లకు బదిలీ చేయవచ్చు. విదేశీ ఓడరేవులకు పంపవచ్చు. అక్కడి నుంచి మదర్‌షిప్‌ల వద్దకు వచ్చే కంటైనర్‌లను అన్‌లోడ్ చేసి చిన్న నౌకలకు తరలించి స్థానిక ఓడరేవులకు పంపవచ్చు.

విజింజం ఇంటర్నేషనల్ ట్రాన్స్‌షిప్‌మెంట్ డీప్‌వాటర్ మల్టీపర్పస్ ఓడరేవు కేరళ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. ఇది ప్రధానంగా బహుళ-ప్రయోజనాలతో పాటు కంటైనర్ ట్రాన్స్‌షిప్‌మెంట్‌ను అందించడానికి రూపొందించబడింది. విజింజం పోర్టుతో సంవత్సరానికి ఒక మిలియన్ కంటైనర్‌లను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇటీవల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు.

 

 

➡️