శ్వేత పత్రం వర్సెస్‌ బ్లాక్‌ పేపర్‌

Feb 9,2024 09:31 #Black Paper, #Parlament, #white paper
  • అధికార, ప్రతిపక్షాల మధ్య ‘ఆర్థిక యుద్ధం’
  • పార్లమెంటులో రభస

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన ప్రతిపక్షాన్ని దెబ్బతీయాలన్న తలంపుతో బిజెపి, గత పదేళ్ల బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్న సంకల్పంతో ప్రతిపక్షం గురువారం పార్లమెంటు వేదికగా రణానికి దిగాయి. ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో తన అట్టర్‌ ఫ్లాప్‌ రికార్డును దాచిపెట్టేందుకు దశాబ్దం క్రితం నాటి యుపిఎ ప్రభుత్వంపై దాడి చేయడమే లక్ష్యంగా 59 పేజీల శ్వేత పత్రాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీనికి కౌంటర్‌గా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ‘బ్లాక్‌ పేపర్‌’ పేరుతో 54 పేజీల పత్రాన్నొకదానిని రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈ రెండు పత్రాలపై శుక్రవారం పార్లమెంటులో చర్చ జరిగే అవకాశముంది.

శ్వేత పత్రం అలా..

దేశ ఆర్థిక స్థితిగ తులపై లోక్‌సభ లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారా మన్‌ శ్వేత పత్రాన్ని ప్రవేశపెడు తూ, యుపిఎ పాలన పై విమర్శలు గుప్పించారు. అదే సమయంలో మోడీ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థ దివ్యంగా వెలిగిపోయినట్లు షో చేశారు. ఏ స్థూల ఆర్థిక కొలబద్ద ప్రకారం చూసినా యుపిఎ కన్నా ఎన్డీయే ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ తీరు చాలా మెరుగ్గా వుందని ఆమె ఆ పత్రంలో సెలవిచ్చారు. యుపిఏ అవినీతి, ధరలు, చెడ్డ అప్పులు, విధానపరమైన అనిశ్చితితో భారత వ్యాపార వాతావరణాన్ని దెబ్బ తీసిందని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి ఆర్థిక వ్యవస్థ చాలా పెళుసుగా ఉందని అన్నారు.పబ్లిక్‌ ఫైనాన్స్‌, ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం యుపిఏలో పెరిగిపోయిందని ఆమె ఆరోపించారు. ఎప్పటిలానే పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ నుంచి రాహుల్‌ గాంధీవరకు కాంగ్రెస్‌ నాయకులపై మోడీ ప్రభుత్వం తన అక్కసునంతా ఈ శ్వేత పత్రులో వెళ్లగక్కింది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా బిజెపి ఇటీవల వరుస దాడులకు దిగుతోంది. దానికి కొనసాగింపుగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తీసుకొచ్చిన ఈ శ్వేత పత్రం. గత పదేళ్ళ కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినట్లైతే, గత ప్రభుత్వం వదిలిపెట్టిన సవాళ్ళన్నింటినీ విజయవంతంగా అధిగమించగలిగామని సంతృప్తికరంగా చెప్పగలుగుతామంటూ ఆ పత్రంలో ప్రభుత్వం పేర్కొంది. అయితే అంతటితో అగలేదు. అమృతకాలం ఇప్పడే ప్రారంభమైందని, 2047కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా రూపొందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇది కర్తవ్య కాలమని ఆమె తన పద గాంభీర్యాన్నంతటినీ ప్రదర్శించారు.

బ్లాక్‌ పేపర్‌ ఇలా..

కాంగ్రెస్‌ అధ్యక్షు లు మల్లికార్జున ఖర్గే ఈ బ్లాక్‌ పేపర్‌ను గురువారం రాజ్యసభ లో ప్రవేశపెడు తూ పదేళ్ల నరేంద్ర మోడీ పాలన వైఫల్యాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. బిజెపి హయాంలో అధిక ధరలు, అంతులేని నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, మహిళలు, మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని ఆ పత్రంలో ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ తన వైఫల్యాలను దాచిపెట్టి ఎంతసేపు ప్రతిపక్షాలను ఆడిపోసుకుంటారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు వాస్తవాలను తెలియజే సేందుకు ఈ బ్లాక్‌ పేపర్‌ ప్రవేశపెట్టామని ఖర్గే అన్నారు. మోడీ పదేళ్ల పాలనలో జిడిపి వృద్ధి రేటు ఇదివరకెన్నడూ లేని విధంగా 5 శాతానికి పడిపోయింది. ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరుకుంది. దేశం చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బ్యాంకింగ్‌ వ్యవస్థ ఛిన్నా భిన్నమైంది. నిపుణులు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. ఆర్థిక మాంద్యం వెంటాడుతోంది’ అని పేర్కొన్నారు. ‘ 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోవడం, నోట్ల రద్దు, లోపభూయిష్ట జిఎస్‌టి వంటి ఆర్థిక విపత్తులు మోడీ సర్కార్‌ పుణ్యమేనని బ్లాక్‌ పేపర్‌ విమర్శించింది. ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల మిలియన్ల మంది రైతులు, రోజువారీ కూలీ కార్మికుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరడం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ఎంఎస్‌పికి చట్టబద్ధత కల్పించేందుకు నిరాకరించింది. ఇప్పుడు దేశంలో ‘మొదానీ రాజ్‌’ సాగుతోంది అని ఆ పత్రం ధ్వజమెత్తింది. ఆర్థిక నేరగాళ్లకు సురక్షితమైన స్వర్గధామాలను తొలగిస్తామని చెప్పిన మోడీ దానికి భిన్నంగా క్రోనీ క్యాపిటలిజాన్ని పెంచిపోషిస్తున్నారు. సామాజిక అన్యాయం కింద, గత దశాబ్దంలో ‘మహిళలు, ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలు, మైనారిటీలపై క్రూరమైన వివక్ష, అణచివేత’ కొనసాగుతోంది. ‘ద్వేషం, మత పరమైన సమీకరణలు , దేశ సామాజిక నిర్మాణ చట్రాన్ని నాశనం చేస్తున్నాయి. ‘అగ్నిపథ్‌’ పేరుతో సైన్యాన్ని ప్రభుత్వం అణగదొక్కిందని. ఇడి, సిబిఐ దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులను వేధించే సాధనాలుగా మార్చేసింది. ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు, ఆర్‌బిఐ వంటి స్వతంత్రతపైనా దాడులకు దిగుతోందని బ్లాక్‌ పేపర్‌ విమర్శించింది.

➡️