రాజ్యసభలో క్షమాపణలు చెప్పిన జయాబచ్చన్‌

Feb 9,2024 15:14 #Jaya Bachan

న్యూఢిల్లీ : సమాజ్‌వాదీ పార్టీ ఎంపి జయాబచ్చన్‌ రాజ్యసభలో చేతులు జోడించి మరీ సభ్యులకు క్షమాపణలు చెప్పారు. సభలో కొన్ని సందర్భాలలో జయాబచ్చన్‌ ఆవేశంగా మాట్లాడుతుంటారు. ఇటీవల బడ్జెట్‌ సెషన్‌లో కూడా రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధనకర్‌పై ఆమె ఆవేశంతో మాట్లాడారు. రాజ్యసభలో తన చివరి ప్రసంగం సందర్భంగా జయాబచ్చన్‌ మాట్లాడుతూ.. ‘నేను షార్ట్‌ టెంపర్‌ వ్యక్తిని. కానీ ఎవరినీ బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. నాకు ఎందుకు కోపం వస్తుందని నన్ను తరచు అడుగుతంటారు. అది నా స్వభావం. దాన్ని నేను మార్చుకోలేను. నేను ఏదైనా ఇష్టపడకపోయినా.. లేదా అంగీకరించకపోయినా నేను నా సహనాన్ని కోల్పోతాను. నేను మీలో ఎవరితోనైనా అనుచితంగా ప్రవర్తించినట్లయితే నేను క్షమాపణలు కోరుతున్నాను.’ అని ఆమె చేతులు జోడించారు. జయాబచ్చన్‌ మాట్లాడిన అనంతరం రాజ్యసభ ఉపాధ్యక్షుడు జగదీప్‌ ధనకర్‌ మాట్లాడుతూ.. ‘జయాబచ్చన్‌కున్న అపారమైన జ్ఞానాన్ని చాలా మిస్‌ అవుతామని, ఆమె లోటును పూరించలేనిది.’ అని ఆయన అన్నారు.

కాగా, మంగళవారం కాంగ్రెస్‌ నాయకుడినుద్దేశించి జగదీప్‌ ధనకర్‌ చేసిన వ్యాఖ్యలను జయాబచ్చన్‌ తప్పుపట్టారు. సమస్యను వివరించినట్లయితే సభ్యులకు అర్థమయ్యేది. వారేమి పాఠశాల పిల్లలు కాదు. ఎంపీలను గౌరవంగా చూడాలని జయాబచ్చన్‌ అన్నారు.

➡️