తుపాను నష్టంపై రాష్ట్రం మాటలు… కేంద్రం మౌనం

-సిఎం జగన్‌ పంటల నష్టాన్ని పరిశీలించిన తీరు ప్రపంచ రికార్డే!

-తుపాను నష్టానికి కేంద్రం రూ.10 వేల కోట్లు ఇవ్వాలి

-రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం నిర్వహించాలి

-రైల్వే జోన్‌, స్టీల్‌ప్లాంట్‌పై బిజెపిది మోసకారితనం : వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో :రాష్ట్రంలో ఇటీవల సంభవించిన మిచౌంగ్‌ తుపానుతో రైతులు, ప్రజానీకం ఊహించని కష్టాల్లో పడ్డారని, సాయంపై రాష్ట్ర ప్రభుత్వం అమలు కాని మాటలు చెబుతుంటే, కేంద్రం అసలు మాట్లాడడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం విశాఖలోని సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడులతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా, గోదావరి డెల్టాల్లో ఓ వైపు వర్షాభావ పరిస్థితులతో 440 మండలాల్లో పంటలు ఎండిపోయిన స్థితిలో ఈ తుపాను వచ్చి కాసింత పండిన పంటలనూ ఊడ్చేసిందని తెలిపారు. తాడేపల్లి ప్యాలస్‌ నుంచి సిఎం జగన్‌ సమీక్షలు, ఆదేశాలు చేస్తే పని జరుగుతుందా? అని ప్రశ్నించారు. సిఎం జగన్‌ కనీసం పొలంలోకి దిగకుండా, రైతులతో మాట్లాడకుండా అధికారులు వేసిన స్టేజీపై కూర్చొని నష్టపోయిన పంటలను పరిశీలించారని, ఆయన నష్టాన్ని పరిశీలించిన తీరు ప్రపంచ రికార్డు సృష్టించిందని శ్రీనివాసరావు అన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు వ్యవహారం అధ్వానంగా ఉందని తెలిపారు. తాను స్వయంగా బాపట్ల ప్రాంతంలో పరిశీలించగా, రూ.1700 ధర రావాల్సిన రైతులకు రూ.800 ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారని వివరించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే రూ.200 అదనంగా బోనస్‌ ఇచ్చి కొనుగోలు చేయాలని, దీనివల్ల ప్రభుత్వ బియ్యం సేకరణపైనా భారం ఉండదని అన్నారు. దేశం మొత్తమ్మీద ఐదు రాష్ట్రాలను ఈ తుపాను అతలాకుతలం చేసిందని, ఆ రాష్ట్రాల్లో 75 శాతం నష్టపరిహారం కేంద్ర ప్రభుత్వం అడ్వాన్స్‌ కింద మంజూరు చేయాల్సి ఉన్నా ఒక్క రూపాయీ ఇంతవరకూ ఇవ్వలేదని తెలిపారు. మన రాష్ట్రానికి తక్షణమే రూ.10 వేల కోట్లు సాయం కేంద్రం అందించాలని, దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అఖిలపక్షం వేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ప్రజల్లో గూడుకట్టుకున్న అసంతృప్తిని పసిగట్టడంలో కెసిఆర్‌ విఫలమయ్యారని, ఆ విషయాన్ని జగన్‌ గుర్తెరగాలని అన్నారు. ఎపిలోనూ అదే తప్పులు జగన్‌ చేస్తున్నారని తెలిపారు. కెసిఆర్‌ ఓటమి తరువాత జగన్‌ సొంత పత్రికలో వచ్చిన సంపాదకీయాన్ని చదివైనా పనితీరు మార్చుకుని ప్రజల ముందుకు వెళ్లాలని హితవు పలికారు. బిజెపివి మోసపూరిత వ్యాఖ్యలు స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ ఆగిపోయిందంటూ బిజెపి ఎంపి జివిఎల్‌ నరసింహారావు మోసకారి మాటలు చెబుతున్నారని వి.శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే జోన్‌కు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదంటూ పార్లమెంట్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ చేసిన వ్యాఖ్యలు మోసకారితనంతో కూడినవని విమర్శించారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తోన్న బిజెపి నేతలకు ఇక్కడ అడుగుపెట్టే అర్హత లేదన్నారు. రైల్వే జోన్‌ పనులకు భూమి లేకపోతే పని ప్రారంభించరా? అని ప్రశ్నించారు. మోడీ మాటల పట్ల యువత విసిగిపోవడం వల్లే బిజెపిని తెలంగాణలో ఊడ్చి ఎత్తిపోశారన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ ఆపించానంటూ విశాఖలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. కార్మిక పోరాటం వల్ల ఆగిందని తెలిపారు. పవన్‌ చెప్పిందే నిజమైతే పార్లమెంట్‌ సమావేశాల్లో ఎందుకు ఆ ప్రకటన చేయించలేదని ప్రశ్నించారు. ప్రజలు, కార్మికులు పోరాడి ప్రయివేటీకరణ ఆపితే ఈ క్రెడిట్‌ను అమిత్‌ షాకు ఆపాదించే రాజకీయ కుట్రకు పవన్‌ పాల్పడుతున్నారని విమర్శించారు. సిపిఎం స్వతంత్ర బలాన్ని పెంచుకునే క్రమంలో ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటాలతో ముందుకు సాగుతోందని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు శ్రీనివాసరావు సమాధానమిచ్చారు.

➡️