న్యాయశాస్త్ర అధ్యయనం సామాజిక బాధ్యత కావాలి

Mar 26,2024 22:01 #speech, #Supreme Court cji

-సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై.చంద్రచూడ్‌
ప్రజాశక్తి- క్యాంపస్‌ (తిరుపతి) :న్యాయశాస్త్ర అధ్యయనం ప్రజలకు సేవ చేసేందుకు ఉపయోగపడే ఒక మంచి ఔషధమని, దీన్ని సామాజిక బాధ్యతగా ఎంచుకోవాలని కాబోయే న్యాయవాదులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ దిశానిర్దేశం చేశారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్ర విభాగంలో ఐదేళ్ల కోర్సు ప్రారంభించి దశాబ్ది కాలమైన సందర్భంగా ఆ యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయశాస్త్ర సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో న్యాయశాస్త్ర డిగ్రీని రెండో డిగ్రీగా చేసేవారని, ఇప్పుడు ఏకైక డిగ్రీగా ఎంచుకుని దీక్షతో పూర్తి చేస్తున్నారన్నారు. న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తున్న వారిలో విద్యార్థినుల సంఖ్య 50 శాతం కంటే ఎక్కువగా ఉండడం అభినందనీయమని పేర్కొన్నారు. భారతదేశంలో భిన్న భాషలు, భిన్న వస్త్రధారణలు, విభిన్న ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ అందరిలో భారతీయతా మనస్తత్వం, దేశీయ భావన ఒక్కటిగానే ఉంటుందన్నారు. వివిధ రాష్ట్రాల, వివిధ న్యాయశాస్త్ర విభాగాల్లో నిష్ణాతులైన న్యాయమూర్తులతో కొలీజియం వ్యవస్థ ముందుకు సాగుతోందని తెలిపారు. తాము విశ్రాంతిగా కాఫీ తాగే సమయంలోనూ తమ భుజస్కంధాలపై ఎంతటి బాధ్యతలు ఉన్నాయో గుర్తు చేసుకుంటూ ఉంటామన్నారు. తమకు న్యాయ విద్యను నేర్పించిన గురువుల మేధస్సు అసాధారణమైనదని, వారు అపార జ్ఞానాన్ని తనకు పెంచడం వల్ల తాను ప్రధాన న్యాయమూర్తి స్థాయిలో ఉన్నానని గుర్తు చేసుకుంటూ విద్యార్థులకు గురువుల విశిష్టతను తెలియజేశారు. నేషనల్‌ లా యూనివర్సిటీలలో చదివినవారు మాత్రమే గొప్పగా రాణిస్తారని అనుకోవడం నిజం కాదని, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదివినా కృషితో మంచి న్యాయాన్ని సమాజానికి అందించవచ్చని పేర్కొన్నారు. ఎస్‌వియు వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ వి.శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమలో స్థాపించిన ఈ విశ్వవిద్యాలయం 70 ఏళ్ల పయనంలో ఎన్నో మైలురాళ్లు చేరుకుందని, నేడు రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో రెండో స్థానంలో ఉందని వివరించారు. రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ మహ్మద్‌ హుస్సేన్‌, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ పద్మనాభం, ఐదేళ్ల న్యాయశాస్త్ర కోర్సు డీన్‌ ఆచార్య విఆర్‌సి.కృష్ణయ్య, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్‌ భారతి, రిజిస్ట్రార్‌ రజని, న్యాయశాస్త్ర విభాగ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️