బిజెపికి గులాంగిరీ చేసే పార్టీలను ఓడించండి

Feb 9,2024 21:45 #speech, #ys sharmila

– టిడిపి, వైసిపిలకు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టే

– పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి, చాగల్లు :బిజెపికి గులాంగిరీ చేసే పార్టీలను ఓడించాలని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల కోరారు. రానున్న ఎన్నికల్లో టిడిపి, వైసిపిలకు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టేనని విమర్శించారు. బిజెపికి బానిసలుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ మారిపోయారని ఆరోపించారు. వారి స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను బిజెపికి తాకట్టుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపితో పొత్తు కోసం ఈ రెండు పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయన్నారు. ప్రత్యేక హోదా, పోలవరానికి నిధులు ఇవ్వకుండా పదేళ్లుగా రాష్ట్రాన్ని బిజెపి దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా చాగల్లులో ఆ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు సంఘం నాయకులు గారపాట వెంకట సుబ్బారావు మాట్లాడుతూ.. చాగల్లులో షుగర్‌ ఫ్యాక్టరీ ప్రారంభిస్తే వందల కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని, ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదని గుర్తు చేశారు. దళిత నాయకులు బంత శ్యామ్‌ప్రకాష్‌ మాట్లాడుతూ.. హోం మంత్రి నియోజకవర్గంలోనే దళితులకు రక్షణ లేదన్నారు. రవాణా రంగ కార్మికులు మాట్లాడుతూ.. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి అనుసరిస్తోన్న విధానాల ఫలితంగా రవాణా రంగం పూర్తిగా కుదేలైందని చెప్పారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడారు. దళిత మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో దళిత మహిళలకు, దళితులకు రక్షణ లేకుండా పోవడం శోచనీయమన్నారు. వెంటనే హోం మంత్రి తానేటి వనిత తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. వైసిపి ప్రభుత్వ హయాంలో అన్ని ధరలూ విపరీతంగా పెరిగిపోయాయని, సామాన్యులు బతికే పరిస్థితి లేదన్నారు. ఖర్చులు కొండత.. సంక్షేమ పథకాల లబ్ధి గోరంత అన్నట్టుగా ఉందని విమర్శించారు. అమ్మఒడి కింద ఒక్క బిడ్డకు రూ.13 వేలు ఇస్తే కుటుంబంలో మిగిలిన పిల్లల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. జగన్‌ అన్న పథకాలు ఒక చేత్తో ఇస్తూ…మరో చేత్తో గుంజుకొనేలా ఉన్నాయని విమర్శించారు. మద్యం పేర సర్కారు దోపిడీకి పాల్పడుతుందని, జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తోందని అన్నారు. గతంలో ఏడు వేల పోస్టులతో డిఎస్‌సి ప్రకటించిన చంద్రబాబును హేళన చేసిన జగన్‌, ఇప్పుడు చేసింది ఏంటి? అని ప్రశ్నించారు. ఇది దగా డిఎస్‌సి కాదా? అని అన్నారు. మోసపూరిత ప్రలోభాలకు లంగకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు ఓటువేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జెడి. శీలం, రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ, ఎ.అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.

➡️