ఈ ఎన్నికల తరువాత టిడిపి రూపురేఖలు ఉండవ్‌!

Feb 18,2024 21:50 #ananthapuram, #ap cm jagan, #speech

-అందుకే ఆ పార్టీని గెలిపించేందుకు పెత్తందారులంతా ఏకమవుతున్నారు

-జాతీయ పార్టీలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా టిడిపి పొత్తులు

-99 శాతం హామీలను నెరవేర్చాం

-వైసిపికి ప్రజలే స్టార్‌ క్యాంపెయినర్లు

-రాప్తాడు ‘సిద్ధం’ సభలో ముఖ్యమంత్రి జగన్‌

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి: ‘చంద్రబాబు వయసు ఈ ఎన్నికల తరువాత 80 ఏళ్లకు చేరుకుంటుంది. ఆ పార్టీ ఓడిపోతే రాష్ట్రంలో టిడిపి రూపురేఖలు ఉండవు. అందుకే పెత్తందారులంతా ఏకమై టిడిపిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఎన్నికలు అత్యంత కీలకం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లోనూ, 25 పార్లమెంటు స్థానాల్లోనూ గెలవడం వైసిపి టార్గెటని, ఇందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు. అనంతపురం జిల్లా రాప్తాడులో రాయలసీమ స్థాయి ‘సిద్ధం’ సభ ఆదివారం జరిగింది. ఈ సభలో జగన్‌ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రంగురంగుల మ్యానిఫెస్టోలు విడుదల చేయడం, తరువాత వాటిని అమలు చేయకుండా మయం చేయడం టిడిపికి పరిపాటిగా మారిందని విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో 600 హామీలు ఇచ్చి వాటిలో పది శాతం కూడా అమలు చేయలేదన్నారు. గత ఎన్నికల ముందు వైసిపి ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని వివరించారు. అందుకే ప్రజల్లోకి కాలరెగరేసి వెళ్లి వైసిపి నాయకులకు, కార్యకర్తలకు ఓటు అడిగే ధైర్యముందని అన్నారు. చంద్రబాబుని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేరని, అందుకే దత్తపుత్రుడితోపాటు జాతీయ పార్టీలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా పొత్తులు పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని విమర్శించారు. జగన్‌ ఒక్కడినీ ఎదుర్కొనేందుకు ఈ తోడేళ్లన్నీ ఏకమై రాబోయే ఎన్నికల్లో ప్రజల ముందుకు రానున్నాయన్నారు. ప్రజలు తస్మాత్‌ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. టిడిపిని గెలిపిస్తే రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలన్నింటికీ కోతపెట్టే అవకాశముందని హెచ్చరించారు. చంద్రబాబు హయాంలో రైతులకుగాని, మహిళలకుగాని ఏ మాత్రమూ మేలు జరగలేదని విమర్శించారు. ఒక్క వైఎస్‌.జగన్‌ హయాంలోనే సంక్షేమ పథకాలను ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా అందుతున్నాయని వివరించారు. వైసిపికి ప్రజలే స్టార్‌ క్యాంపెయినర్లని అన్నారు. ఈ సభలో రాయలసీమ ప్రాంత మంత్రులు, వైసిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

భారీగా జనసమీకరణ

రాయలసీమ జిల్లాల పరిధిలోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనసమీకరణను వైసిపి చేపట్టింది. లక్షలాది మంది వైసిపి అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తరలచ్చారు. అనంతపురం నగరానికి వచ్చే ప్రధాన రహదారులన్నీ వాహనాలతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యాయి.

బస్సుల్లేక ప్రయాణికుల ఇక్కట్లు

రాప్తాడు సభకు ఆర్‌టిసి బస్సులతోపాటు, ప్రయివేటు, ప్రభుత్వ విద్యా సంస్థల బస్సులనూ పెద్ద ఎత్తున వినియోగించారు. రాయలసీమ వ్యాప్తంగా 1520 ఆర్‌టిసి బస్సులను కేటాయించారు. వీటిలో అనంతపురం జిల్లాకు సంబంధించి 520 ఉన్నాయి. దీంతో, సాధారణ ప్రయాణికులు బస్సుల్లేక ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మరోవైపు ప్రయివేటు విద్యా సంస్థల నుంచి కూడా ఒక్క అనంతపురం జిల్లాలోనే 700 బస్సులను వినియోగించారు. రాయలసీమ జిల్లాల పరిధిలో ఆరు వేల వరకు వాహనాలను ఎన్నికల ప్రచార సభ కోసం వినియోగించడంతో అన్నిచోట్టా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. జాతీయ రహదారి 44ని ఆనుకుని సభ జరగడంతో రెండు గంటలకుపైగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడి

సిద్ధం సభలో ఫొటోలు తీస్తున్న ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ కృష్ణను వైసిపి నాయకులు, కార్యకర్తలు చుట్టుముట్టి దాడి చేసి రక్తం కారేలా కొట్టారు. వేసుకున్న చొక్కాను కూడా చింపేసి దాడి చేయడంతో ఒళ్లంతా వాతలుపడ్డాయి. ఆ పక్కనే ఉన్న ఈనాడు, ఇతర ఫొటోగ్రాఫర్లపైనా దాడికి ప్రయత్నించడంతో వారు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగినా నిలువరించే ప్రయత్నం చేయలేదు. తీవ్రంగా గాయపడిన కృష్ణను అనంతపురం సర్వజన ఆస్పత్రికి సహచరులు తరలించారు.

➡️