డ్రైనేజీ నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

Dec 8,2023 08:24 #cpm v srinivasarao, #press meet

 

-నిర్లక్ష్యంవల్లే వరిపంటకు అపార నష్టం

-వరికి ఎకరాకు రూ.25 వేలు,

-ఇతర పంటలకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో మురుగునీటి వ్యవస్థ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్రైనేజి వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్లనే వర్షను నీరు బయటకు వెళ్లే మార్గం లేక పొలాల్లో నిలిచిపొయిందని తెలిపారు. ఫలితంగా పెద్దఎత్తున వరి, ఇతర పంటలు నీటమునిగి దెబ్బతిన్నాయని చెప్పారు. ఎనిమిది జిల్లాల్లో ధాన్యం పూర్తిగా నీటమునిగిందని, పట్టణాలు, గ్రామాల్లో కాలనీల్లో నీరు నిలిచిపోయిందని తెలిపారు. తుపాను ప్రాంతాల్లో సిపిఎం నాయకులతో కూడిన మూడు బృందాలు పర్యటించాయని, ఈ పర్యటనల్లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం చెబుతున్న మాటలకు, ఆచరణకు పొంతనలేదన్నారు. సిఎం చేస్తున్న ప్రకటనల్లో ఒక్క శాతం కూడా అమలు జరగడం లేదని తమ పరిశీలనలో వెల్లడైనట్లు చెప్పారు. పంట పొలాల్లో ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ పూర్తిగా నిర్వీర్యం అయిందని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నిధులతో వేలకోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ ఇప్పుడు ఎందుకు పనిచేయడంలేదో ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా ఉంటే నీరు బయటకు వెళ్లి కొంత నష్టం తగ్గేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను వల్ల 10 నుండి 20 శాతం పంట దెబ్బతింటే డ్రైనేజీ లోపం వల్ల 80 శాతం దెబ్బతిందని వివరించారు, అన్నిచోట్లా డ్రైనేజీలు దురాక్రమణకు గురయ్యాయని తెలిపారు. కృష్ణా, గుంటూరు, బాపట్ల, అమలాపురం తదితర జిలాల్లో పొలాల్లో పెద్దఎత్తున నీరు నిలిచిపోయిందని తెలిపారు. ఇప్పటికీ 75 శాతం ధాన్యం పొలాల్లోనే ఉందని పేర్కొన్నారు. మంత్రులు రూ.1100 కోట్లు ధాన్యం కొనుగోలుకు కేటాయించి రూ.800 కోట్లు విలువైన ధాన్యం కొనేశామని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. పొలాల్లో కాలుపెట్టకుండా రోడ్డుపై తిరిగి అదే పరిశీలనగా ప్రచారం చేసుకుంటూ రైతులను ప్రజలు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడికక్కడ కాలనీల్లో నీరు నిలిచిందని, నెల్లూరు, బాపట్లలో పరిస్థితి చెన్నై నగరం కంటే అన్యాయంగా ఉందని అన్నారు.. కాలనీల్లో కరెంటు, నీరు లేదని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లోనూ సరైన సదుపాయాలు లేవని తెలిపారు. ఈ ఏడాది సాధారణంగానే వర్షాభావం, నీటి నిర్వహణలో వైఫల్యం కారణంగా సాగు జరగలేదని, సాగైన పంట తుపానుకు దెబ్బతినిపోయిందని అన్నారు. కల్లాల్లో ధాన్యం తడిచిపోతుంటే రక్షణ కోసం పట్టాలు కూడా సరఫరా చేయలేదని, ఆర్‌బికెల ద్వారా సబ్సిడీకి ఇస్తామన్నారని, ఇప్పుడా ఊసేలేదని విమర్శించారు. ఎక్కువచోట్ల కౌలు రైతులు సాగు చేస్తున్నారని, వారందరూ నష్టపోయారని తెలిపారు. సాగుకోసం వారు ఇప్పటికే చాలా అప్పులు చేశారని, వారందరికీ పరిహారం అందించాలని, దీనికోసం నిబంధనలు మార్చాలని కోరారు. ఆర్బిటేషన్‌ కమిటీలు వేసి, గ్రామసభలు నిర్వహించి కౌలు రైతుల రుణాలు మాఫీ చేయడంతోపాటు దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇప్పించాలని డిమాండు చేశారు. రైతులకు నష్టం జరగకూడదని ప్రభుత్వం, సిఎం ప్రకటనలు తప్ప ఆచరణలో ఎక్కడా న్యాయం జరగడం లేదని, ఇప్పటికీ ఎన్యూమరేషన్‌ చేయలేదని అన్నారు. రైతుకు తక్షణసాయంగా ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలని, ఇ క్రాప్‌తో నిమిత్తం లేకుండా కౌలు రైతులందరికీ పరిహారం అందించాలని, వ్యాపార పంటలకు ఎకరాకు రూ.50 వేలు చొప్పున ఇవ్వాలని కోరారు. తక్షణం డ్రైనేజీ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన బాగుచేయించాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని నాణ్యతతో నిమిత్తం లేకుండా గిట్టుబాటు ధరమీద బస్తాకు రూ.200 బోనస్‌ కలిపి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. తదుపరి పంట వేసుకోవడానికి ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఉచిత విత్తనాలు ఇవ్వాలని కోరారు. పేదవారికి కార్డుపై 20 కిలోల బియ్యంంతోపాటు పప్పు, చింతపండు, నూనె, చక్కెర ఉచితంగా ఇవ్వాలని కోరారు. జగనన్న కాలనీల్లో ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఖర్చు భరించి నిర్మించి ఇవ్వాలని కోరారు. పంట రుణాలు రద్దు చేయాలని, ఉచిత పంట బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె.ఉమామహేశ్వరరావు, కె.ధనలక్ష్మి మాట్లాడారు.

➡️