న్యాయమైన సమస్యలకు పరిష్కారం చూపాలి

-22వ రోజుకు చేరుకున్న ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమ్మె

ప్రజాశక్తి-యంత్రాంగం:తమను రెగ్యులర్‌ చేయాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 22 రోజులుగా సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.. సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని వారు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు బుధవారం వివిధ రూపాల్లో సమ్మె కొనసాగించారు. నెల్లూరు జెఎసి నాయకులు మాట్లాడుతూ అధికారులు ఎన్ని బెదిరింపులు బెదిరించినప్పటికీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినప్పటికీ ఉద్యోగుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించేంతవరకు సమ్మెను కొనసాగిస్తామన్నారు. 22 రోజుల నుంచి సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష అనేది ప్రాజెక్టా? లేక సోసైటీనా అనేదానిపై రాష్ట్రంలోని జిల్లా అధికారులు స్పష్టతనివ్వాలని కోరారు. గతంలో ఇది సొసైటీ అంటూ జిఒలు రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆరోపించారు. ఉద్యోగులను బెదిరించడానికి చూపించే అంత శ్రద్ధ ఉద్యోగుల సమస్యలు పరిష్కారంచడంలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్లలో ఆకులు తింటూ నిరసనలు తెలిపారు. రాష్ట్ర సిఆర్‌పిల సంఘం అధ్యక్షులు గిరి శ్రీనివాస్‌ మద్దతు తెలిపారు. కాకినాడలో బైకు ర్యాలీ నిర్వహించారు. ఏలూరులో ఒంటి కాలిపై నిలబడి వినూత్నంగా, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో గంగిరెద్దుకు వినతిపత్రం అందజేసి నిరసనలు తెలిపారు. అనంతపురం, సత్యసాయి జిల్లా, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, నెల్లూరు, గుంటూరు, ఉమ్మడి కృష్ణా జిల్లా, తూర్పుగోదావరి, డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో సమ్మె శిబిరాలలో నిరసనలు కొనసాగాయి.

➡️