అంగన్‌వాడీలపై కర్కశం

anganwadi workers strike 23 day police attack

 

  • పలు జిల్లాల్లో అరెస్టులు, ఉద్రిక్తత
  • అక్కడికక్కడ అడ్దగింతలు
  • నిర్బంధాన్ని అధిగమించి కలెక్టరేట్ల వద్ద అంగన్‌వాడీల బైటాయింపు

ప్రజాశక్తి-యంత్రాంగం : అంగన్‌వాడీలపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. కలెక్టరేట్ల బైటాయింపు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి నిర్బంధాన్ని ప్రయోగించారు. పలు జిల్లాల్లో అరెస్టులకు పాల్పడ్డారు. బస్సుల్లో వెళ్తున్న అంగన్‌వాడీలను బలవంతంగా దించేశారు. ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. నిర్బంధాన్ని అధిగమించి కలెక్టరేట్ల వద్దకు చేరుకొని వేలాది మంది అంగన్‌వాడీలు బుధవారం బైటాయించారు. నిర్బంధాలకు, బెదిరింపులకు భయపడేది లేదని, తమ న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. వారి నినాదాలతో కలెక్టరేట్లు హోరెత్తాయి.

 

  • విజయవాడలో వి.శ్రీనివాసరావు సహా పలువురు అరెస్టు

విజయవాడలో పోలీసులు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సహా పలువురిని అరెస్టు చేశారు. ఎన్‌టిఆర్‌ జిల్లాలోని అన్ని మండలాల నుంచి విజయవాడ కలెక్టరేట్‌కు వస్తున్న అంగన్‌వాడీలపై పోలీసులు విరుకుపడి బీభత్సం సృష్టించారు. నాలుగు ప్రాంతాల్లో సుమారు వెయ్యి మందిని బలవంతంగా అరెస్టు చేసి ఎంజి రోడ్డులోని ఎఆర్‌ గ్రౌండ్స్‌, మాచవరం పోలీస్‌ స్టేషన్‌, హనుమాన్‌పేటలోని శ్రీరాజరాజేశ్వరి కళావేదిక కల్యాణ ప్రాంతాలకు తరలించారు. అరెస్టుల సందర్భంగా పోలీసులు కర్కశంగా వ్యవహరించడంతో ఎల్‌.రమాదేవి సహా పలువురు అంగన్‌వాడీలకు తీవ్ర గాయాలయ్యాయి. అంగన్‌వాడీలతో కలిసి ర్యాలీలో వస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావును బలవంతంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేతికి తీవ్ర గాయమైంది. అంగన్‌వాడీ హెల్పర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మను అరెస్టు చేశారు. యూనియన్‌ ఎన్‌టిఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.సిహెచ్‌.సుప్రజను వెంటపడి మరీ పట్టుకుని పోలీసులు గొంతు నొక్కేయడంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్వరాజ్యం మైదానం వద్ద సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి, ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు నాయకులను పోలీసులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఆ తర్వాత వారందరినీ పోలీసులు విడుదల చేశారు. దీనికి ముందు వివిధ పోలీసు స్టేషన్లలో ఉన్న వారిని సిపిఎం సీనియర్‌ నాయకులు పి.మధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, వి.వెంకటేశ్వర్లు, రైతు సంఘం, సిఐటియు నాయకులు పరామర్శించారు. విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరిన అంగన్‌వాడీలను రోప్‌లతో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీలకు, పోలీసులకు మధ్య పలుమార్లు వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకుంది. పోలీసులను, రోప్‌లను నెట్టుకుంటూ అంగన్‌వాడీలు కలెక్టరేట్‌కు పరుగులు తీశారు. పోలీసులు కూడా వారితో పరుగులు తీసి జైలు రోడ్డు జంక్షన్‌ వద్ద అడ్డుకున్నారు. దీంతో, అంగన్‌వాడీలు అక్కడ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసులు అరెస్టులకు పాల్పడ్డారు. పోలీసులను తప్పించుకొని కలెక్టర్‌కు చేరుకున్న అంగన్‌వాడీలను అక్కడా పోలీసులు అరెస్టు చేశారు. విశాఖలో మొత్తం వెయ్యి మందిని అరెస్టు చేసి ఆ తర్వాత విడిచిపెట్టారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పలువురు అంగన్‌వాడీలను, సిఐటియు నాయకులను బలవంతంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అరెస్టు చేసి టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌, రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ భవనంలో నిర్బంధించారు. గుంటూరులో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులను పలువురి పోలీసులు ఇళ్ల వద్ద అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అయినా, పోలీసుల ఆంక్షలను అధిగమించి వేలాది మంది అంగన్‌వాడీలు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. నరసరావుపేటలో కలెక్టరేట్‌ వద్ద రోడ్డుపై భోజనాలు చేశారు. కోలాటం ఆడారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌, జిల్లా ఉపాధ్యక్షులు జి.విజరుకుమార్‌ తదితరులు పాల్గన్నారు. విజయనగరం కలెక్టరేట్‌ వద్ద బైటాయించిన అంగన్‌వాడీలకు నోటీసులు ఇవ్వడానికి సిడిపిఒ అక్కడకి వచ్చారు. దీంతో, ఆమెను అంగన్‌వాడీలు నిర్బంధించారు. తనకు ఎలాంటి సంబంధమూ లేదని బతిమలాడటంతో విడిచిపెట్టారు. పోలీసుల నిర్బంధాన్ని ఛేదించుకొని అంగన్‌వాడీలు బాపట్ల కలెక్టరేట్‌కు చేరుకొని బైటాయించారు.

ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీసులకు, అంగన్‌వాడీలకు మధ్య తోపులాట చేసుకుంది. ఈ సందర్భంగా ఇద్దరు అంగన్‌వాడీలకు స్పల్ప గాయాలయ్యాయి. నెల్లూరులో పోలీసులకు, అంగన్‌వాడీలకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. అంగన్‌వాడీల బైటాయింపుతో అన్నమయ్య జిల్లా రాయచోట కలెక్టరేట్‌ హోరెత్తింది. వైఎస్‌ఆర్‌ జిల్లా కడప కలెక్టరేట్‌ వద్ద సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నరసింగరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేసే వరకూ పోరాటం ఆగదన్నారు. చిత్తూరు కలెక్టరేట్‌ ఎదుట వేలూరు-చిత్తూరు జాతీయ రహదారితోపాటు కలెక్టరేట్‌కు వెళ్లే రహదార్లపై పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి వచ్చిపోయే ఆటోలు, బస్సులు, ప్రయివేట్‌ వాహనాలను తనిఖీ చేశారు. అంగన్‌వాడీ అని అనుమానం వచ్చిన వారినల్లా కిందకు దింపి వెనక్కు పంపేశారు. పోలీసుల నిర్భందాలను దాటుకొని వేలాది మంది కలెక్టరేట్‌కు చేరుకొని కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం ముందు బైటాయించారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నరసింహారావుతో సహా 50 మందిని పోలీసు అరెస్టు చేశారు. తిరుపతి కలెక్టరేట్‌ ఎదుట వేలాది మంది అంగన్‌వాడీలు కదంతొక్కారు. బారికేడ్లను తోసేసి కలెక్టరేట్‌ గేటు తెరుచుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన అంగన్‌వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. దీనికి ముందు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంఎ.గఫూర్‌ పాల్గని మాట్లాడుతూ తెలంగాణ కంటే రూ.వెయ్యి వేతనం ఎక్కువ ఇస్తామని చెప్పిన జగన్‌ నాలుగేళ్లు పూర్తయినా పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. నంద్యాలలో కలెక్టరేట్‌ ఎదుట వేలాది మంది అంగన్‌వాడీలు బైటాయించారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకొని భారీగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్‌కు తరలివచ్చారు. అనంతపురం కలెక్టరేట్‌ వద్ద బైటాయించి నిరసన తెలిపారు. శ్రీకాకుళంలో అంగన్‌వాడీలు తమ వెంట తెచ్చుకున్న క్యారియర్లతో రోడ్డుపై బైటాయించి అక్కడే భోజనం చేసి ఆందోళన కొనసాగించారు. అమలాపురంలో అంగన్‌వాడీల ఆందోళనలో పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ఎవి.నాగేశ్వరరావు పాల్గని మద్దతు తెలిపారు. కాకినాడలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు జి.బేబిరాణి ప్రసంగించారు. ఏలూరులో 144 సెక్షన్‌ విధించినా భయపడకుండా అంగన్‌వాడీలు కలెక్టరేట్‌ వద్దకు చేరుకొని బైటాయించారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు పాల్గని ప్రసంగించారు. అనకాపల్లిలో నెహ్రూ చౌక్‌ జంక్షన్లో అంగన్‌వాడీలు బైటాయించి నిరసన తెలిపారు. అల్లూరి జిల్లా పాడేరులో కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీలు బైఠాయించారు. ఎటపాక, కూనవరం, విఆర్‌.పురం, చింతూరు నాలుగు మండలాల అంగన్‌వాడీలు చింతూరు ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

 

  • రేపటి నుండి విజయవాడలో24 గంటల రిలేదీక్షలు

అమరావతి : శుక్రవారం(ఐదవ తేది) నుండి విజయవాడలో 24 గంటల రిలే నిరాహార దీక్షలు నిర్వహించనునుట్లు అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్ప్‌ర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ తెలిపారు. ఈ మేరకువిడుదల చేసిన ప్రకటనలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద బైఠాయింపు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అంగన్‌వాడీలకు అభినందనలు తెలిపారు. గురువారం ఆందోళనలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. శుక్రవారం విజయవాడలో చేపట్టనున్న రిలే నిరాహార దీక్షలను యూనియన్‌ అఖిల భారత కార్యదర్శి ఎ.ఆర్‌ సింధు ప్రారంభిస్తారని తెలిపారు. శనివారం (ఆరవ తేది) అనిు జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద 24 గంటల రిలే నిరాహార దీక్షలు ప్రారంభించాలని, అదే సమయంలో ప్రస్తుతం ఎక్కడికక్కడ జరుగుతున్న ఆందోళనలను కొనసాగించాలని అంగన్‌వాడీలకు పిలుపునిచ్చారు.

➡️