సిసిఎస్‌ ఎసిపి ఉమామహేశ్వరరావు అరెస్ట్‌

May 22,2024 09:56 #arrested, #CCS ACP

తెలంగాణ : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో … సెంట్రల్‌ క్రైం స్టేషన్‌లో ఏసీపీగా పని చేస్తున్న టీఎస్‌ ఉమామహేశ్వరరావును ఎసిబి అధికారులు అరెస్టు చేశారు. తెలంగాణ, ఎపిలోని ఉమామహేశ్వరావు ఇళ్లు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లతో సహా మొత్తం 11 చోట్ల తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో నగదు, బంగారం, ఆస్తి పత్రాలతో పాటు రెండు బ్యాంకు లాకర్లను గుర్తించినట్లు తెలిసింది. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ప్రారంభమైన సోదాలు నిన్న రాత్రి వరకు కొనసాగాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావును అరెస్టు చేసినట్లు ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ సుధీంద్రబాబు తెలిపారు. ఉమామహేశ్వరరావును అరెస్టు చేశామని, బుధవారం కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు.

నిందితుల నుండి భారీ మొత్తంలో డిమాండ్‌ …
ప్రీ లాంచ్‌ ఆఫర్ల పేరుతో వేలాది మంది నుంచి డబ్బు వసూలు చేసి నిండా ముంచిన సాహితీ ఇన్‌ఫ్రా సంస్థ, దాని అనుబంధ సంస్థలపై అనేక కేసులు నమోదయ్యాయి. రూ.వేల కోట్లతో ముడిపడి ఉన్న ఈ స్కామ్‌కు సంబంధించిన కేసులు అన్నీ సీసీఎస్‌కు బదిలీ అయ్యాయి. దాదాపు 50 కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బఅందం (సిట్‌) ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు దాని బాధ్యతలు ఉమామహేశ్వరరావుకు అప్పగించారు. దీన్ని తనకు అనువుగా మార్చుకున్న ఉమా మహేశ్వరరావు నిందితుల నుంచి భారీ మొత్తం డిమాండ్‌ చేసి వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితులకు వత్తాసు పలుకుతూ బాధితులకు తీవ్ర అన్యాయం చేశారనే ఫిర్యాదులు ఏసీబీకి అందాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదులూ వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న ఏసీబీ దర్యాప్తు చేపట్టింది.

➡️