పేదల పట్ల ఔదార్యం చూపండి

  • న్యాయవాదులకు సిఎం సూచన
  • వైఎస్‌ఆర్‌ లా నేస్తం నిధులు విడుదల

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పేదల పట్ల ఔదార్యం చూపుతూ, మానవతా దృక్పధంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి న్యాయవాదులకు సూచించారు. వైఎస్‌ఆర్‌ లా నేస్తం పథకంలో భాగంగా సోమవారం ఆయన క్యాంపు కార్యాలయం నుండి బటన్‌ నొక్కడం ద్వారా ఆయన నిధులు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,807 మంది న్యాయవాదులకు ఆరు నెలల కాలానికి రూ.7.98 కోట్లు విడుదల చేసినట్లు సిఎం కార్యాలయం తెలిపింది. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ప్రభుత్వం న్యాయవాదులకు తోడుగా ఉంటున్న విధంగానే, పేదలకూ న్యాయవాదులు తోడుగా ఉండాలన్నారు. దీనిని తాను చేస్తున్న వినతిగా భావించాలన్నారు. లా పూర్తి చేసుకుని వృత్తిలోకి ప్రవేశించే సమయంలో వారికి ి ప్రోత్సాహకరంగా ఉండేందుకు ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లు చెప్పారు. వైఎస్‌ఆర్‌ లా నేస్తమే కాకుండా రూ.100కోట్లతో అడ్వకేట్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌ను కూడా స్థాపించినట్లు తెలిపారు. దానివల్ల కోవిడ్‌ సమయంలో ఎంతో మేలు జరిగిందన్నారు. ఇది కాకుండా మర వైపు 7,733మంది న్యాయవాదులకు రూ.11.56కోట్లు రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. మరో 14,818 మంది అడ్వకేట్లకు మెడిక్ల్తెయిమ్‌ పాలసీ కింద మరో రూ.11.41కోట్లు చెల్లించినట్లు ఆయన తెలిపారు. మరొక వైపు ఆడ్వకేట్స్‌ కమ్యూనిటీకి రూ.25కోట్లు ఇచ్చి వారికి తోడుగా నిలిచామన్నారు.ఈ కార్యక్రమంలో సిఎస్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, లా సెక్రటరీ జి. సత్యప్రభాకరరావు, అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

➡️